Nitish Kumar: బీజేపీ ప్రభుత్వానికి సీఎం నితీష్ కుమార్ షాక్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలోని జేడీయూ మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. సీఎం బీరెన్ సింగ్ ప్రభుత్వానికి జేడీయూకి ఉన్న ఒక ఎమ్మెల్యే మద్దతుని విత్ డ్రా చేసుకుని, ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధపడ్డారు. అయితే, ఈ పరిణామం అక్కడి ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపదు. బీజేపీ ప్రభుత్వ మెజారిటిపై పెద్దగా ఎఫెక్ట్ పడదు.
Read Also: Congress: రూ.382 కోట్ల హెల్త్ స్కామ్‌తో కేజ్రీవాల్‌కి సంబంధం..కాంగ్రెస్ సంచలన ఆరోపణ..
కేంద్రంలో బీజేపీకి జేడీయూ గట్టి మద్దతుదారుగా ఉంది. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్వయంగా మెజారిటీ రాలేదు. జేడీయూ, టీడీపీ బలంపైనే ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ని దాటింది. ప్రస్తుతం జేడీయూకి 12 మంది ఎంపీలు ఉన్నారు. వీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ పరిణామం బీజేపీకి ఒక సందేశంగా మారిందనే చర్చ నడుస్తోంది. మరోవైపు బిరెన్ సింగ్ ప్రభుత్వానికి మేఘాలయా అధికార పార్టీ కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ కూడా గత నెలలో మద్దతు ఉపసంహరించుకుంది.
మణిపూర్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 6 సీట్లు గెలుచుకుంది. కానీ ఎన్నికల జరిగిన కొన్ని నెలల తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 60 మంది ఉన్న మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది శాసనసభ్యులు ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 31. నాగా పీపుల్స్ ఫ్రంట్‌కి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రుల మద్దతు కూడా బీజేపీకి ఉంది. మొత్తంగా ఎన్డీయే ప్రభుత్వానికి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.