Site icon NTV Telugu

Nitish Kumar Bihar Strategy: బీహార్‌ను విడిచేది లేదు.. సర్కార్‌పై ఓ కన్నేసి ఉంచుతా..! నితీష్‌కుమార్‌ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఇదేనా?

Nitish Kumar Bihar Strategy

Nitish Kumar Bihar Strategy

Nitish Kumar Bihar Strategy: బీహార్ రాజకీయాల్లో సంచలనం రేపేలా జేడీయూ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “నేను బీహార్‌ను విడిచిపెట్టను… ప్రభుత్వంపై కన్నేసి ఉంచుతాను” అని ఆయన స్పష్టం చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లినా, బీహార్ రాజకీయాలపై తన పట్టు మాత్రం సడలించబోనని నితీష్ సంకేతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత సమ్రాట్ చౌదరి కొత్త నాయకత్వంగా ఎదిగారు. అయితే అధికార బాధ్యతలు మారినా, రాజకీయ ప్రభావం మాత్రం ఇంకా నితీష్‌కే ఉందని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. పాట్నాలో జరిగిన జేడీయూ శాసనసభ పక్ష సమావేశంలో పార్టీ నేతలు నితీష్‌కే పూర్తి అధికారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read Also: Phone Snatching: హైదరాబాద్‌లో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

ఇక, సమావేశం అనంతరం నితీష్ కుమార్ మాట్లాడుతూ, తాను బీహార్‌లోనే ఎక్కువ సమయం గడుపుతానని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలు, ప్రజలతో నేరుగా మమేకమవుతానని తెలిపారు. పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని, అంతా సాధారణంగానే ఉందని ఆయన చెప్పడం ద్వారా జేడీయూలో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటిచెప్పారు. అయితే, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ముఖ్యమంత్రి పదవి వదిలినా నితీష్ కుమార్ అసలు లక్ష్యం జేడీయూ సంస్థను మరింత బలోపేతం చేయడమే. ప్రభుత్వ యంత్రాంగ బాధ్యతల నుంచి విముక్తి పొందిన ఆయన, ఇప్పుడు పార్టీ పునాదులను బలపరచడంపై దృష్టి సారించనున్నారని అంటున్నారు. అదే సమయంలో సమ్రాట్‌ చౌదరి ప్రభుత్వ పనితీరుపై కూడా పర్యవేక్షణ కొనసాగించనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

బీహార్‌లో విస్తృత పర్యటన చేపట్టనున్న నితీష్ కుమార్, జిల్లాల వారీగా ప్రజాభిప్రాయాలను తెలుసుకుని కొత్త సంస్థాగత చట్రం సిద్ధం చేయాలని చూస్తున్నారు. ఇది అధికారిక ప్రభుత్వ పర్యటన కాకుండా, పూర్తిగా రాజకీయ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమంగా భావిస్తున్నారు. క్షేత్రస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసి రాబోయే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ఇక, మరో కీలక అంశం ఆయన కుమారుడు నిశాంత్‌ కుమార్‌ రాజకీయ ప్రవేశమే. ఇప్పటికే నిశాంత్ బీహార్‌లో వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పాట్నాలోని పార్టీ కార్యాలయంలో కూడా ఆయన చురుకుగా వ్యవహరిస్తున్నారు. దీంతో నితీష్ కుమార్ తన వారసత్వ రాజకీయాలకు బాటలు వేస్తున్నారా అనే చర్చ మొదలైంది.

రాజకీయంగా చూస్తే, నితీష్ కుమార్ ఇప్పుడు ద్వంద్వ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు జేడీయూ బలహీనపడకుండా కాపాడుకోవడం, మరోవైపు తన కుమారుడు నిశాంత్‌కు భవిష్యత్ నాయకత్వానికి పునాది వేయడం ఆయన లక్ష్యంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఢిల్లీ కంటే పాట్నా, బీహార్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. మొత్తానికి, అధికార పదవి నుంచి తప్పుకున్నా బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ పాత్ర ముగియలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇకపై ఆయన ప్రత్యక్ష అధికారంలో కాకపోయినా, పరోక్షంగా బీహార్ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా కొనసాగనున్నారని స్పష్టమవుతోంది.

Exit mobile version