Site icon NTV Telugu

Nitish Kumar: బీహార్ కొత్త ముఖ్యమంత్రి పేరుపై నితీష్ కుమార్ సంకేతాలు!.. భగ్గుమంటున్న జేడీయూ నేతలు!

Nitishkumar

Nitishkumar

బీహార్ కూటమి ప్రభుత్వంలో రాజకీయ ప్రకంపనలు చేలరేగుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు నితీష్ కుమార్ వైఖరే కారణంగా తెలుస్తోంది. రెండు దశాబ్దాల పాటు బీహార్‌ను ఏకచక్రాధిపత్యంగా నితీష్ కుమార్ పరిశీలించారు. గతేడాది నవంబర్‌లోని జరిగిన ఎన్నికల్లో నితీష్ కుమార్ కూటమి భారీ విజయాన్ని సాధించింది. దీంతో మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై నితీష్ కుమార్ కూర్చు్న్నారు. అయితే ఇంతలో ఏమైందో.. ఏమోగానీ సడన్‌గా రాజ్యసభకు వెళ్లిపోయారు. దీంతో కూటమి ప్రభుత్వంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఇప్పుడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకు తాజాగా నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా ఉన్నాయి.

ప్రస్తుతం నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రంలో ‘‘సమృద్ధి యాత్ర’’ నిర్వహిస్తున్నారు. బుధవారం జముయి జిల్లాలో పర్యటిస్తూ నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని ఉద్దేశించి కీలక సంజ్ఞలు చేశారు. ‘‘బీహార్‌ను సామ్రాట్ చౌదరే పర్యవేక్షిస్తారని.. రాష్ట్రం కచ్చితంగా గణనీయమైన పురోగతిని సాధిస్తుంది.’’ అని సూచించారు. నితీష్ కుమార్ అలా మాట్లాడుతుండగా సామ్రాట్ చౌదిరి రెండు చేతులు జోడించి వేదికపై ఉల్లాసంగా కనిపించారు.

ప్రస్తుతం ఈ పరిణామమే బీహార్‌లో హాట్ టాఫిక్‌గా మారింది. అట్టెట్టా.. సామ్రాట్ చౌదరి పేరు ఎలా ఉచ్ఛరిస్తారంటూ జేడీయూలో ఉన్న కీలక నేతలు భగ్గుమంటున్నారు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అంతకముందు సహర్సాలో సామ్రాట్ చౌదరి భుజంపై నితీష్ కుమార్ చేయి వేసి రాజకీయ సంకేతం ఇచ్చారు. రాజకీయ సంజ్ఞలు చేశారు. ఇప్పుడు జముయ్ పర్యటనలో ఏకంగా సామ్రాట్ చౌదరి బీహార్‌ను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. బీహార్ తదుపరి ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరినే అవుతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి. ఈ వ్యవహారమే జేడీయూలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

అయితే నితీష్ కుమార్ సూచనలపై జేడీయూ కీలక నేతలు భగ్గుమంటున్నారు. జేడీయూ మంత్రిగా ఉన్న విజయ్ చౌదరి మాట్లాడుతూ.. నితీష్ కుమార్.. సామ్రాట్ చౌదరిని తన రాజకీయ వారసుడిగా ప్రకటించలేదని తెలిపారు. ఒకవేళ అదే జరిగితే జేడీయూ నేతలు తీవ్రంగా వ్యతిరేకించ వచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే నితీష్ కుమార్ ఇంకా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. త్వరలోనే రాజీనామా చేయనున్నారు. అయితే తదుపరి ముఖ్యమంత్రి మాత్రం బీజేపీ నుంచే అవుతారని సంకేతాలు ఉన్నాయి. అది ఎవరన్నది ఇంకా తేలలేదు. రేసులో మాత్రం సామ్రాట్ చౌదరి, దిలీప్ జైస్వాల్, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ సహా పలువురు నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీహార్‌లోని కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్టానం ఓబీసీ అభ్యర్థిని ఎంపిక చేసుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఎలాంటి గందరగోళం లేకుండా ముఖ్యమంత్రి ఎంపికను బీజేపీ హైకమాండ్ ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి.

Exit mobile version