NTV Telugu Site icon

Bihar Political Crisis: బిహార్‌ ముఖ్యమంత్రి పదవికి నితీష్‌ కుమార్ రాజీనామా

Nitish Kumar Resigns As Bihar Cm

Nitish Kumar Resigns As Bihar Cm

Bihar Political Crisis: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌కు ఒంటరిగా వచ్చిన ఆయన గవర్నర్‌ ఫాగు చౌహాన్‌తో భేటీ అయ్యారు. అనంతరం గవర్నర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. బిహార్ గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన తర్వాత ఎన్‌డీఏ నుండి వైదొలగాలని ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని నితీష్ కుమార్ వెల్లడించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఎన్డీయేకు గుడ్‌బై చెప్పాలని నితీశ్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌తో టచ్‌లో ఉన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి జేడియూ సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసే యోచనలో నితీష్ ఉన్నారని సమాచారం.  నితీష్ కుమార్ తన రాజీనామా అనంతరం పాట్నాలోని రబ్రీదేవి నివాసానికి బయలుదేరి వెళ్లారు.

బీజేపీతో పొత్తును తెంచుకుని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. తన తదుపరి రాజకీయ ఎత్తుగడలపై చర్చించేందుకు కుమార్, అంతకుముందు రోజు జేడీయూ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత గవర్నర్ ఫాగు చౌహాన్‌ను సమయం కోరారు. సాయంత్రం 4 గంటలకు, కుమార్ రాజ్‌భవన్‌కు చేరుకుని, గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలుసుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న తన నిర్ణయాన్ని ఆయనకు తెలియజేశారు. అంతకుముందు జరిగిన జేడీయూ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలందరూ ముఖ్యమంత్రి కుమార్ నిర్ణయానికి మద్దతు పలికారు. నితీశ్‌కుమార్ నిర్ణయానికి తమ మద్దతు కొనసాగుతుందని కూడా వారు నొక్కి చెప్పారు. బీజేపీతో పొత్తు 2020 నుంచి తమను బలహీనపరిచిందని చాలా మంది జేడీయూ శాసనసభ్యులు నేటి సమావేశంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో చెప్పినట్లు తెలుస్తోంది.

Bihar Politics: బిహార్‌లో దోస్తీపై అవగాహనకు వచ్చిన జేడీయూ-ఆర్జేడీ.. డిప్యూటీ సీఎంగా తేజస్వి!

అయితే ఆర్జేడీతో కలిసి నితీష్‌ కుమార్‌ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కొత్త ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమారే ఉండనున్నట్టు సమాచారం. ఆర్జేడీ మద్దతు ఇస్తున్న కారణంగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. బీహార్‌లో ఎన్డీఏ కూట‌మి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్‌.. బీజేపీతో క‌లిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బీజేపీతో సంబంధాలు స‌రిగా లేని కార‌ణంగా.. ఆ కూట‌మికి ఇవాళ గుడ్‌బై చెప్పేశారు నితీశ్‌. బీజేపీ(77)-జేడీయూ(45) కూట‌మి పాల‌న బిహార్‌లో ముగిసిపోయింది.

యునైటెడ్‌ జనతాదళ్‌ను చీల్చేందుకు అమిత్‌షా కుట్ర చేశారన్నది నితీష్ కుమార్ ప్రధాన ఆరోపణ. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే సీన్‌ రిపీట్‌ చేసి ఆర్సీపీ సింగ్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి అమిత్‌షా పథకం రచించారని పలువురు జేడీయూ నేతలు ఆరోపిస్తున్నారు. నితీశ్‌కుమార్‌ ముందే మేల్కొని.. బీజేపీకి దూరం జరుగుతున్నారని అంటున్నారు. మరోవైపు.. బిహార్‌ రాజకీయాలపై చర్చించేందుకు ఢిల్లీలో బీజేపీ కోర్‌ కమిటీ భేటీ సమావేశం కాబోతోంది.