NTV Telugu Site icon

Nitish Kumar: కనీసం 4 కేబినెట్ బెర్తులు కావాలి, నితీష్ కోరుతున్నది ఈ మంత్రిత్వ శాఖలనేనా.?

Nda

Nda

Nitish Kumar: ఎన్డీయే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. జూన్ 8 లేదా 9న ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో కాకుండా ఈ సారి బీజేపీ, భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జేడీయూ పార్టీలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. 543 సీట్లు ఉన్న లోక్‌సభలో 272 మ్యాజిక్ ఫిగర్. 2014, 2019లో రెండు సార్లు బీజేపీ సొంతగానే ఈ మార్క్‌ని దాటింది. అయితే, 2024 ఎన్నికల్లో మాత్రం 240 సీట్లు గెలుచుకుంది. ఎన్డీయే కూటమిగా 292 స్థానాలను గెలుచుకుంది.

Read Also: BJP: రామ మందిర సీటును కోల్పోవడమే కాదు, గుడితో సంబంధం ఉన్న మరో వ్యక్తి కూడా ఓడిపోయాడు..

ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జేడీయూ, శివసేన, ఎల్జేపీ వంటి పార్టీలపై బీజేపీ ఆధారపడాలి. దీంతో ఈ పార్టీల నుంచి విన్నపాలు, కేబినెట్ బెర్తులను, రాష్ట్రాలకు నిధులను డిమాండ్ చేసే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 12 మంది ఎంపీలు ఉన్న జనతాదళ్-యునైటెడ్(జేడీయూ) పార్టీ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ మంత్రి పదవుల కోసం గట్టిగా డిమాండ్ చేయనున్నారు. దీంతో పాటు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.

జేడీయూ మూడు క్యాబినెట్ మంత్రితో పాటు ఒక MOS(స్వతంత్ర హోదా) కోరుతోంది. కనీసం నాలుగు కేబినెట్ బెర్తులు దక్కుతాయని ఆశిస్తు్నారు. రైల్వే, గ్రామీణాభివృద్ధి, జలవనరుల వంటి శాఖలపై పార్టీ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. వెనకబడి ఉన్న బీహార్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ కేబినెట్ బెర్తులు ఉపయోగపడుతాయని జేడీయూ అనుకుంటోంది.