Chirag Paswan: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజీనామాను సమర్పించడంతో పాటు బీజేపీతో పొత్తును కూడా రద్దు చేసుకున్నారు. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) మాజీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మధ్యంతర ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో ఆయన కేవలం 43 సీట్లకు తగ్గారని.. వచ్చేసారి సున్నా గెలుస్తారని విమర్శించారు. నితీష్‌కు విశ్వసనీయత సున్నా అంటూ విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ రెండోసారి ప్రజల తీర్పును అవమానించారని ఆరోపించిన చిరాగ్ పాశ్వాన్.. బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
నితీష్ కుమార్ దురహంకారంతో బిహార్ నష్టపోయిందని కేంద్ర మాజీ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఆయన రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, విశ్వసనీయత లేదని, బిహార్ ముఖ్యమంత్రికి ఎలాంటి సిద్ధాంతాలు పట్టవని పాశ్వాన్ ఆరోపించారు. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ సర్కారు ఎప్పుడైనా వెనుదిరగవచ్చని ముందే హెచ్చరించినట్లు ఆయన వెల్లడించారు.
బీహార్‌లో అనూహ్య పరిణామాల మధ్య నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు నితీష్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో లాలూ ప్రసాద్ ఇంట తేజస్వీ యాదవ్‌తో నితీష్ కుమార్ భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా. బిహార్‌లో రాజకీయ పరిణామాలపై దేశవ్యాప్తంగా పొలిటికల్ చర్చ నడుస్తోంది. తాజాగా నితీష్ కుమార్ రాజీనామాపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. “ఇది మంచి ప్రారంభం. నాడు ‘అంగ్రేజో భారత్ చోడో'(ఆంగ్లేయులకు భారత్ నుంచి తరిమి కొట్టండి) నినాదం ఇవ్వబడింది. నేడు బిహార్ నుండి ‘బీజేపీ భగావ్'(బీజేపీని వెళ్లగొట్టండి) అనే నినాదం వస్తోంది. త్వరలోనే రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతారని నేను భావిస్తున్నాను.” అంటూ కామెంట్స్ చేశారు.
Bihar Political Crisis: బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక నితీశ్ కుమార్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవి ఇంటికి చేరారు. ఇప్పటికే రబ్రీ నివాసానికి ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ-ఎంఎల్ ఎమ్మెల్యేలు, నేతలు చేరుకున్నారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ-ఎంఎల్‌తో కలిసి నితీశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 122 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఈ కూటమి వద్ద ఉన్నారు.