Site icon NTV Telugu

Bihar Political Crisis: గవర్నర్‌ను కలిసిన నితీష్ కుమార్, తేజస్వి యాదవ్.. ప్రభుత్వ ఏర్పాటుపై లేఖ

Nitish Kumar Meets Governor

Nitish Kumar Meets Governor

Bihar Political Crisis: బిహార్‌ రాజకీయాల్లో మరోసారి కీలక మలుపు చోటుచేసుకుంది. బీజేపీకి రెండోసారి షాక్‌ ఇస్తూ ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చేసింది. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆర్​జేడీ, కాంగ్రెస్​, వామపక్షాలతో చేతులు కలిపింది. ఆ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఏర్పాటు చేయనున్నారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. నితీష్​ కుమార్​ ఎత్తుగడతో బిహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయినట్లు అయింది. మంగళవారం పాట్నాలో గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవి నివాసంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో పాటు పలువురు నేతల్ని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు.

2017లో ఏం జరిగిందో మర్చిపోదామని.. ఇప్పుడు సరికొత్త అధ్యాయం ప్రారంభిద్దామంటూ తేజస్వీ యాదవ్‌తో నితీష్ అన్నట్లు తెలిసింది. తర్వాత కాసేపటికే.. నితీష్‌ కుమార్, తేజస్వీ యాదవ్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. తమకు సంఖ్యాబలం ఉందని చెబుతూ.. అందుకు సంబంధించిన పత్రాల్ని సమర్పించారు. రేపు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తును తెంచుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత బీహార్‌లో ఏడు పార్టీల మద్దతుతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనతాదళ్-యునైటెడ్ నాయకుడు నితీష్ కుమార్ మంగళవారం తెలిపారు. ఆర్జేడీ సహా ఏడు పార్టీలు తనకు మద్దతిస్తున్నాయని చెప్పారు. మహాగట్‌బంధన్‌లో స్వతంత్రులతో పాటు 164 మంది ఎమ్మెల్యేలు సహా 7 పార్టీలు ఉన్నాయని ఆయన మీడియాతో వెల్లడించారు. ఆ సమయంలో ఆయన వెంట ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు. 243 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో జేడీయూ, ఆర్జేడీ కలిసి మెజారిటీని కలిగి ఉన్నాయి. జేడీయూకి 45, ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి జితన్ మాంఝీకి చెందిన హెచ్‌ఏఎం వంటి చిన్న పార్టీల మద్దతు కూడా ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.నితీష్ కుమార్ రాజీనామాకు ముందు హైవోల్టేజ్ రాజకీయాలకు బిహార్ వేదికైంది. ప్రధాన పార్టీలన్నీ విడివిడిగా తమ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించాయి.

Bihar Political Crisis: బిహార్‌ ముఖ్యమంత్రి పదవికి నితీష్‌ కుమార్ రాజీనామా

యునైటెడ్‌ జనతాదళ్‌ను చీల్చేందుకు అమిత్‌షా కుట్ర చేశారన్నది నితీశ్ కుమార్ ప్రధాన ఆరోపణ. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే సీన్‌ రిపీట్‌ చేసి ఆర్సీపీ సింగ్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి అమిత్‌షా పథకం రచించారని పలువురు జేడీయూ నేతలు ఆరోపిస్తున్నారు. నితీశ్‌కుమార్‌ ముందే మేల్కొని.. బీజేపీకి దూరం జరుగుతున్నారని అంటున్నారు. మరోవైపు.. బిహార్‌ రాజకీయాలపై చర్చించేందుకు ఢిల్లీలో బీజేపీ కోర్‌ కమిటీ భేటీ సమావేశం కాబోతోంది.

Exit mobile version