Site icon NTV Telugu

Nitin Gadkari: హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్యపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Nitin Gadkari

Nitin Gadkari

గాజా-ఇజ్రాయెల్ యుద్ధం ఏ రేంజ్‌లో జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలిసిందే. రెండేళ్ల పాటు గ్యాప్ లేకుండా రెండు దేశాల మధ్య వార్ నడిచింది. హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర యుద్ధం చేసింది. హమాస్ ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వేటాడి.. వెంటాడి ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. ఈ క్రమంలో హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను కూడా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ గురిపెట్టి అంతమొందించింది. ఇది జరిగింది గాజాలో కాదు.. పొరుగున ఉన్న ఇరాన్‌ దేశంలో ఉండగా ఇస్మాయిల్ హనియేను హతమార్చింది. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయింది.

తాజాగా ఇస్మాయిల్ హనియే హత్యను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గుర్తుచేశారు. హత్యకు ముందు ఏం జరిగిందో. ఆయన్ను ఎలా కలుసుకున్నారో కీలక విషయాలను కేంద్రమంత్రి పంచుకున్నారు. అసలు ఇస్మాయిల్ హనియేను గడ్కరీ ఎందుకు కలుసుకున్నారు. ఆ విషయాలు తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ.. ఇస్మాయిల్ హనియే హత్యకు కొన్ని గంటల ముందు ఏం జరిగిందో వివరించారు. హత్యకు ముందు ఇస్మాయిల్ హనియేను తాను ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు.

ఇరాన్‌కు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మసౌద్ పెజె‌ష్కియాన్ ప్రమాణస్వీకారోత్సవానికి భారతదేశం తరపున ప్రధాని మోడీ తనను ఇరాన్ పంపించారని చెప్పారు. టెహ్రాన్‌లోని ఐదు నక్షత్రాల హోటల్‌లో ఆయా దేశాధినేతలు, సీనియర్ రాజకీయ ప్రముఖులంతా ఒక దగ్గర చేరి అనధికారికంగా సమావేశమై టీ, కాఫీ తాగుతున్నారని.. ఆ సమయంలో ఇస్మాయిల్ హనియే కూడా అక్కడే ఉండడంతో కలిసినట్లు తెలిపారు. అనంతరం ప్రమాణస్వీకార కార్యక్రమానికి అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తితో కలిసి హనియే కూడా కారులో వెళ్లడం ప్రత్యక్షంగా చూసినట్లు గుర్తుచేశారు.

ఇక ప్రమాణస్వీకారోత్సవం అయిపోయాక తిరిగి హోటల్‌కు తిరిగి వచ్చేశానని.. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భారతదేశంలోని ఇరాన్ రాయబారి తన దగ్గరకు వచ్చి వెంటనే బయల్దేరాలన్నారు. విషయం తెలియక.. ఏమైంది? ఏం జరిగిందని అడిగితే.. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురైనట్లు చెప్పారని పేర్కొన్నారు. వెంటనే షాక్‌కు గురైనట్లు తెలిపారు. ఇది ఎలా జరిగిందో అడిగానని.. ‘నాకు తెలియదు’ అని సమాధానం వచ్చినట్లు గడ్కరీ గుర్తుచేశారు.

అయితే హమాస్ నాయకుడు ఎలా చనిపోయాడో ఇప్పటికీ సందిగ్ధం ఉందని గడ్కరీ చెప్పుకొచ్చారు. కొంతమంది మొబైల్ ఫోన్ వాడటం వల్లే చనిపోయాడని అంటున్నారని.. మరికొందరైతే వేరే విధంగా జరిగిందని అంటున్నారని పేర్కొన్నారు. ఏదేమైనా ఒక దేశం బలంగా ఉంటే.. ఏ దేశం కూడా చేయి వేయడానికి సాహసించదని తెలిపారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ ప్రతిభను ప్రశంసించారు. సాంకేతికంగా.. అధునాతన పరిజ్ఞానం, సైనిక సామర్థ్యం కారణంగా చిన్న దేశమైన ఎదుర్కొంటుందన్నారు. అందుకే ప్రపంచమంతా ఇజ్రాయెల్ గురించి చెప్పుకుంటున్నారని వెల్లడించారు.

జూలై 31న తెల్లవారుజామున 1:15 గంటలకు హనియే హత్యకు గురయ్యారని ఇరాన్ అధికారులు ధృవీకరించారు. మొసాద్ టార్గెట్ చేసి చంపినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇరాన్ గూఢచారుల సహకారంతో బస చేసిన హోటల్‌లో బాంబులు అమర్చడంతో ఈ హత్య జరిగినట్లుగా సమాచారం.

అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం ఇజ్రాయెల్.. హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా గాజాపై బాంబు దాడులు చేసింది. రెండేళ్ల పాటు ఏకధాటిగా జరిగింది. ఇటీవలే ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.

Exit mobile version