దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులపై భారం పడుతూనే ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను కేంద్రం పెంచుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు, ఎన్నికలకు సంబంధం లేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావంతో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. దేశంలో ఇంధన ధరల పెరుగుదలను పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అయితే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు తిప్పికొడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచే రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయని.. అప్పుడు పెరగని చమురు ధరలు ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో గమ్మున ఉండి.. ఇప్పుడు పెట్రో బాదుడుకు పూనుకోవడం మోదీ ప్రభుత్వ మోసకారితనానికి నిదర్శనమని మండిపడుతున్నారు.
