Site icon NTV Telugu

Nirav Modi: నీరవ్ మోడీకి ఈడీ షాక్.. రూ. 253.62 కోట్ల విలువైన ఆస్తులు జప్తు

Nirav Modi

Nirav Modi

Nirav Modi: బ్యాంకు రుణాల ఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి సంబంధించిన కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు పురోగతి సాధించారు. నీరవ్‌కు సంబంధించిన ₹253.62 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్‌ చేసింది. ‌ఈ జాబితాలో చరాస్థులైన రత్నాలు, ఆభరణాలతో పాటు బ్యాంకు డిపాజిట్లు కూడా ఉన్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు. మనీల్యాండరింగ్ నిరోధక చట్టాల కింద ఆస్తులను అటాచ్ చేసినట్టు అధికారులు తెలిపారు. సీజ్‌ చేసిన ఈ ఆస్తులన్నీ హాంకాంగ్‌లో ఉన్నాయని ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 420, 467, 471, 120-బీ కింద చర్యలు తీసుకున్నామని ఈడీ అధికారులు వివరించారు. హాంకాంగ్‌లోని నీరవ్ మోదీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రత్నాలు, ఆభరణాలు అక్కడి ప్రైవేటు లాకర్లలో ఉన్నట్లు ఈడీ గుర్తించింది.

West Bengal: మంత్రి సన్నిహితురాలి ఇంట్లో రూ. 20 కోట్లు.. ఈడీ దాడుల్లో పట్టుబడిన నగదు

కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.13,500కోట్ల మోసం కేసులో నీరవ్ మోడీ ప్రస్తుతం యూకే జైలులో ఉన్నాడు. భారత్‌కు అప్పగింత ప్రక్రియ జాప్యమవుతున్న నేపథ్యంలో అక్కడి జైళ్లోనే గడుపుతున్నాడు. పీఎన్‌బీ మోసం కేసును సీబీఐదర్యాప్తు చేస్తుండగా.. మోసం కేసులో మనీల్యాండరింగ్ కింద ఈడీ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. నకిలీ ఎల్‌వోయూలతో బ్యాంకును మోసగించిన వ్యవహారం 2018 జనవరిలో బయటపడిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే అతడు దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి పరబ్‌ సైతం కనిపించకుండా పోయాడు.

Exit mobile version