Nipah virus: ప్రాణాంతక వైరస్ ‘నిపా’ మరోసారి కలవరపెడుతోంది. గతంలో కేరళలో ఈ వైరస్ వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలుపోయాయి. తాజాగా మరోసారి కేరళలో ఈ వైరస్ వణుకుపుట్టిస్తోంది. తాజా ఇన్ఫెక్షన్ల వల్ల ఆ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలటో ఇద్దరు మరణించారు. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో హెల్త్ అలర్ట్ ప్రకటించింది. అత్యవసరంగా సమావేశమైన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
జ్వరం తర్వాత ఇద్దరు అసహజంగా మరణించారని, ఇది నిపా వైరస్ కారణమే అని అనుమానం వ్యక్తంమవుతోందని రాష్ట్రం ఓ ప్రకటనలో తెలిపింది. మరణించిన వారిలో ఒకరి బంధువు కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. 2018-2021లో కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ కారణంగా పలు మరణాలు చోటు చేసుకున్నాయి. దక్షిణ భారతదేశంలో మొదటి నిపా కేసు మే 19, 2018లో నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వైరస్ జంతువుల నుంచి ప్రజలకు సంక్రమించే జూనోటిక్ వ్యాధి, కలుషిత ఆహారం లేదా వ్యక్తి నుంచి వ్యక్తికి సంక్రమిస్తుంది.
Read Also: Tomato Price: అప్పుడు ఆకాశానికి.. ఇప్పుడు పాతాళానికి.. రూ.కి కూడా టమాటాలు కొనే దిక్కు లేదు
గబ్బిలాలు, పందుల వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకిన జంతువుల లాలా జలం, మూత్రం వల్ల వ్యాపించే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన గబ్బిలం తిన్న పళ్లను తినడం ద్వారా ఇది వస్తుంది. వ్యాధి ప్రధాన లక్షణాలను గమనిస్తే తీవ్రమైన శ్వాసకోశ, ప్రాణాంతక ఎన్సెఫాలిటిస్ వరకు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.