NTV Telugu Site icon

TAHAWWUR RANA: తహవూర్ రాణాని అధికారికంగా అరెస్ట్ చేసిన ఎన్ఐఏ..

Rana

Rana

TAHAWWUR RANA: 26/11 ముంబై ఉగ్రదాడి కుట్రదారు, ఉగ్రవాది తహవూర్ హుస్సేన్ రాణానికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారికంగా అరెస్ట్ చేసింది. భారత అధికారులు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నుంచి రొమేనియా మీదుగా ఛార్టెడ్ ఫ్లైట్‌లో ఢిల్లీకి తీసుకువచ్చారు. ఢిల్లీకి తీసుకువచ్చిన వెంటనే ఎన్ఐఏ అతడిని అదుపులోకి తీసుకుంది. ఎన్ఐఏ సంవత్సరాల కృషి మూలంగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని అమెరికా భారత్‌కి అప్పగించింది.

రాణాకు వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత, పాటియాలా కోర్టులో హాజరుపర్చనున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి పాటియాల హౌజ్ కోర్టు వరకు తీసుకెళ్లే మార్గంలో విస్తృత భద్రత ఏర్పాటు చేశారు. ఢీల్లీలోని పరేడ్ రోడ్, సర్దార్ పటేల్ రోడ్, మదర్ థెరిస్సా క్రిసెంట్, అక్బర్ రోడ్ మీదుగా కోర్టుకు తీసుకెళ్లనున్నారు.

Read Also: Puri – Sethupathi: ఇట్స్ అఫీషియల్.. టబు ఆన్ డ్యూటీ

తహవూర్ రాణా చివరి వరకు భారత్‌కి అప్పగించకుండా అమెరికాలోని అన్ని న్యాయ సదుపాయాలను ఉపయోగించుకున్నాడు. చివరకు అక్కడి న్యాయస్థానాలు రాణాని భారత్‌కి అప్పగిస్తూ తీర్పు చెప్పాయి. ఎన్ఐఏ పలు సంవత్సరాల కృషి కారణంగా ఉగ్రవాదిని భారత్‌కి రప్పించగలిగారు. రాణా అప్పగింతలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యునైటెడ్ స్టేట్స్‌లోని సంబంధిత అధికారులు సమన్వయం చేసుకున్నారు.

2008లో ముంబైలోని విధ్వంసకర ఉగ్రవాద దాడుల్లో పాక్-కెనెడియన్ అయిన 67 ఏళ్ల రాణా హస్తం ఉంది. రాణా, పాక్ అమెరికన్ అయిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ, పాక్ కుట్రదారులతో కలిసి లష్కరే తోయిబా, హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. 26/11 ముంబై దాడుల్లో 166 మంది మరణానికి కారణం అయ్యాడు.