NTV Telugu Site icon

NIA: ఉగ్రకదలికలపై ఎన్‌ఐఏ సోదాలు.. ఆదివారం పలు రాష్ట్రాల్లో దాడులు

National Investigation Agency

National Investigation Agency

NIA: దేశంలో ఉగ్ర కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక నిఘా పెట్టింది. ఆదివారం 8 రాష్టాల్లో భారత్‌లో ఐసిస్ ఉగ్రసంస్థ కార్యకలాపాలపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా దాడులు చేసింది. 13 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. స్థానికులకు ఐసిస్‌తో ఉగ్ర లింకులపై ఆరాతీసింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకొంది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని జిరాయత్‌ నగర్‌లో కూడా ఎన్‌ఐఏ ఆదివారం సోదాలు నిర్వహించడం గమనార్హం. జిరాయత్‌ నగర్‌లో ఎన్‌ఐఏ అధికారులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకొన్నారు. సదరు యువకుడికి విదేశాల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Covid Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కేరళల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేసి నేరమయ డాక్యుమెంట్లు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. యూపీలోని దేవ్‌బంద్‌లోని ఓ మదర్సాలో కర్ణాటకకు చెందిన ఫరూక్‌ అనే విద్యార్థిని ప్రశ్నించి పంపించారు. ఉగ్ర సంబంధాల ఆరోపణలపై కర్ణాటకలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన ఫరూక్‌ యూపీలోని దేవబంద్‌లో ఓ మదర్సాలో ఉంటున్నాడు. పాక్‌ ఐఎస్‌ఐతో అతనికి సంబంధాలున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ఎన్‌ఐఏ ఆదివారం ఫరూక్‌ను అదుపులోకి తీసుకొంది. ఐసిస్‌కు సంబంధించి నమోదైన ఓ కేసులో గుజరాత్‌లో ముగ్గురు అనుమానితులను ఎన్‌ఐఏ ప్రశ్నించింది. తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో తమిళనాడులోని ఆంబూరుకు చెందిన మీరా అనాస్‌ అలీ(22)ని అదుపులోకి తీసుకొంది. అతని గది నుంచి ఒక ల్యాప్‌టాప్‌, రెండు మొబైల్‌ ఫోన్లు సిమ్‌ కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.