Site icon NTV Telugu

Dawood Ibrahim: దావూద్‌ ఇబ్రహీం అండ్‌ గ్యాంగ్‌పై రివార్డు ప్రకటించిన ఎన్‌ఐఏ..

Nia

Nia

గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి సమాచారం ఇస్తే రూ.25 లక్షలు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ).. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అరెస్టుకు దారితీసే ఏదైనా సమాచారం ఇస్తే 25 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఇక, ఇబ్రహీం సన్నిహితుడు షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్‌పై రూ. 20 లక్షలు, సహచరులు హాజీ అనీస్ అలియాస్ అనీస్ ఇబ్రహీం షేక్, జావేద్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా, ఇబ్రహీం రజ్జక్‌మోన్ తిజ్క్‌మోన్‌లకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షల నగదు రివార్డును కూడా దర్యాప్తు సంస్థ ప్రకటించింది.

Read Also: GST Collections: రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఆగస్టులో రూ.1,43,612 కోట్లు..

వీరంతా 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో మోస్ట్‌ వాంటెడ్ నిందితులు.. వారి ఆచూకీ, అరెస్టు చేసేందుకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌ఐఏ కోరిందని ఓ అధికారి తెలిపారు. ఆ సంస్థ ఫిబ్రవరిలో ‘డీ కంపెనీ’పై కేసు నమోదు చేసింది. మరోవైపు… దావూద్ ఇబ్రహీంను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించిందని, అతని సన్నిహితులైన అనీస్ ఇబ్రహీం షేక్, ఛోటా షకీల్, జావేద్ చిఖ్నా మరియు టైగర్ మెమన్‌లతో పాటు డీ-కంపెనీ అనే అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.

వారు ఆయుధాల స్మగ్లింగ్, టెర్రరిజం, అండర్ వరల్డ్ క్రిమినల్ సిండికేట్, మనీలాండరింగ్, ఎఫ్‌ఐసీఎన్‌ యొక్క సర్క్యులేషన్, టెర్రర్ నిధులను సేకరించడం మరియు లష్కర్‌తో సహా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో క్రియాశీల సహకారంతో కీలక ఆస్తులను అనధికారికంగా స్వాధీనం చేసుకోవడం వంటి వివిధ ఉగ్రవాద-నేర కార్యకలాపాలలో పాల్గొంటున్నారని పేర్కొన్న ఎన్‌ఐఏ.. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌, అల్ ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్ర ముఠాలకు కీలక సహకారం అందిస్తున్నట్లు పేర్కొంది.. కాగా, దావూద్‌ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు అధికారికంగా వెల్లడైన విషయం తెలిసిందే.

Exit mobile version