Uttar Pradesh: సాధారణంగా నవజాత శిశువుల్ని ఉదయం పూట సూర్యరశ్మిలో కొన్ని నిమిషాలు ఉంచాలని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. అయితే ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ డాక్టర్ కూడా నవజాత శిశువు విషయంలో ఇలాగే సలహా ఇచ్చాడు. అయితే, శిశువు ఉదయం అరగంట పాటు ఎండలో ఉండటంతో మరణించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో జరిగింది. 5 రోజుల శిశువు మరణించడంతో కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనపై మెయిన్ పురి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్సీ గుప్తా విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం సదరు ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ పరారీలో ఉన్నాడు.
ఆర్సీ గుప్తా ప్రకారం.. మెయిన్‌పురి భుగై గ్రామానికి చెందిన రీటా దేవీ 5 రోజుల క్రితం సీ-సెక్షన్ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం శిశువులో కొన్ని ఆరోగ్య సమస్యలు కనిపించాయి. శిశువును సూర్యరశ్మిలో అరగంట పాటు ఉంచమని కుటుంబానికి సలహా ఇచ్చాడు. వైద్యుడి సలహా మేరకు ఉదయం 11.10 గంటలకు పసికందును ఆస్పత్రి పైకప్పుపై ఉంచారు. 30 నిమిషాల తర్వాత చిన్నారిని కిందకు దించారు. అప్పటికే పాప చనిపోయింది.
‘‘నియోనాటల్ జాండిస్’’ నివారించేందుకు నవజాత శిశువులను సూర్యరశ్మి సోకేలా కొంత సమయం ఎండలో ఉంచుతారు. అయితే, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. సాధారణం సూర్యోదయం పూట ఇలాంటివి చేస్తారు. కానీ ఆ కుటుంబం మాత్రం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బిడ్డను ఎండలో ఉంచడంతోనే చనిపోయినట్లు తెలుస్తోంది. ఎండ దెబ్బ, వేడి అధికంగా ఉండటం, బిడ్డను పర్యవేక్షించకపోవడంతో శిశువు మరణించిందని వైద్యులు చెబుతున్నారు.
సలహా ఇచ్చిన డాక్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆస్పత్రి సిబ్బంది రీటా దేవీని బలవంతంగా డిశ్చార్జ్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని, చర్యలు తీసుకుంటామ్ని సీఎంవో డాక్టర్ ఆర్సీ గుప్తా చెప్పారు.