NTV Telugu Site icon

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

1234

1234

New Parliament Inauguration: భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహత్తర ఘట్టం ప్రారంభం కాబోతోంది. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగ ప్రారంభం కాబోతోంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త పార్లమెంట్ ను భారత ప్రభుత్వం నిర్మించింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 60 మంది మతపెద్దలను కూడా ఆహ్వానించారు. ఉదయం 7 గంటలకు కొత్త భవనం వెలుపల ఉన్న పార్లమెంట్ ప్రాంగణంలో పూజతో కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ప్రధాన అర్చకులు రాజదండాన్ని(సెంగోల్)ను ప్రధాని మోదీకి అందచేస్తారు. ప్రస్తుతం నిర్మించిన కొత్త పార్లమెంట్ ఇది వరకు ఉన్న 1927లో నిర్మితమైన భవనం కన్నా చాలా విశాలంగా నిర్మించారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నుండి తివాచీలు, త్రిపుర నుండి వెదురు ఫ్లోరింగ్ మరియు రాజస్థాన్ నుండి రాతి శిల్పాలతో కొత్త పార్లమెంట్ భవనం భారతదేశం యొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. పార్లమెంట్ లోపలి భాగంలో కమలం, నెమరి, మర్రిచెట్టు వంటి పెయింటింగ్ ఉన్నాయి. త్రిభుజాకారంలో నాలుగు అంతస్తుల పార్లమెంటు భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ ఇలా మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి.

The liveblog has ended.
  • 28 May 2023 01:54 PM (IST)

    రానున్న కాలంలో ఎంపీ స్థానాలు పెరుగుతాయి: ప్రధాని నరేంద్ర మోడీ

    ఎంపీల సంఖ్య పెరుగుదల భవిష్యత్తులో ఉంటుందని అందుకే కొత్త పార్లమెంట్ ఏర్పాటు చేశామన్నారు. త్వరలో ఎంపీల సీట్లు పెరుగుతాయి, పాత పార్లమెంట్‌లో తగినన్ని సీట్లు లేవు, పాత పార్లమెంట్‌లో సాంకేతిక సమస్యలున్నాయని ప్రధాని అన్నారు. 2026 తర్వాత జరిగే మొదటి జనగణన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని అన్నారు.

  • 28 May 2023 01:30 PM (IST)

    PM Modi: 140 కోట్ల భారతీయుల కల సాకారమైంది... ఈ రోజు చరిత్రలో నిలుస్తుంది..

    ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని.. 140 కోట్ల భారతీయుల కల సాకారమైందని.. ఆధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్‌ అద్దం పడుతుందని.. ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమని కొత్త పార్లమెంట్ గురించి ప్రధాని మోడీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కొత్త పార్లమెంట్ నిర్మించుకున్నామని.. ఇది కేవలం భవనం మాత్రమే కాదని.. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అని అన్నారు. పవిత్రమైన సెంగోల్ ను పార్లమెంట్ లో ప్రతిష్టించాం.. భారత్ అభివృద్ధి చెందితే.. ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రధాని అన్నారు.

  • 28 May 2023 01:05 PM (IST)

    రూ.75 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని..

    రూ. 75 నాణెంతో పాటు స్టాంపును విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. కొత్త పార్లమెంట్ వేడుకలో వివిధ రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు హాజరయ్యారు.

  • 28 May 2023 01:02 PM (IST)

    ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగింది: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా

    ఈ అమృత్ కాల్ లో ప్రపంచంలోనే భారత దేశ ప్రతిష్ట పెరిగిందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. అంతర్గత, ప్రపంచ సవాళ్లను అవకాశాలుగా మార్చగల సామర్థ్యం మన పార్లమెంట్ కు ఉందని అన్నారు. మన బలమైన భవిష్యత్తుకు ప్రజాస్వామ్యమే పునాది అని, భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అని అన్నారు. కొత్త పార్లమెంట్ కొత్త ఆలోచనకు కారణం అవుతుందని నేను నమ్ముతున్నానని అన్నారు. మన పార్లమెంటరీ వ్యవస్థలో మంచి సూత్రాలను మనం ముందుకు తీసుకెళ్లాని సూచించారు.

  • 28 May 2023 12:36 PM (IST)

    కొత్త పార్లమెంట్ ఒక ముఖ్యమైన మైలురాయి: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్

    ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో 2.5 ఏళ్లలో కొత్త పార్లమెంట్ నిర్మించడం చాలా సంతోషకరమైన విషయమని, ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అన్నారు. అమృత్ కాల్ లో ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.

  • 28 May 2023 12:28 PM (IST)

    ప్రధాని మోడీకి స్టాండింగ్ ఒవేషన్..

    కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. లోక్‌సభలోకి ప్రవేశించగానే ఎంపీలు, వివిధ రాష్ట్రాలు సీఎంలు, ఇతర ప్రజాప్రతినిధులు మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేశారు. నిలబడి తమ చప్పట్ల మధ్య ఆహ్వానం పలికారు.

  • 28 May 2023 12:24 PM (IST)

    కొత్త లోక్‌సభలో వేడుక ప్రారంభం..

    కొత్త లోక్‌సభలో జాతీయ గీతాలాపనతో వేడుక ప్రారంభం అయింది. ప్రధాని మోడీతో పాటు లోక్ సభ స్పీకర్, పార్లమెంట్ సభ్యులు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

     

  • 28 May 2023 11:26 AM (IST)

    కొత్త పార్లమెంట్ ను శవపేటికతో పోల్చిన ఆర్జేడీ.. బీజేపీ కౌంటర్..

    లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చింది. 2024 ఎన్నికల్లో బీహార్ ప్రజలు మిమ్మల్ని అటువంటి శవపేటికలోనే పాతిపెడతారంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది.

  • 28 May 2023 11:22 AM (IST)

    ఇది చారిత్మాత్మక క్షణం: యోగి ఆదిత్యనాథ్

    న్యూ ఇండియా ఆశలు, అంచనాలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు చిహ్నంగా అద్భుతమైన కొత్త పార్లమెంట భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

  • 28 May 2023 09:27 AM (IST)

    కొత్త పార్లమెంట్‌ని జాతికి అంకితం చేసిన ప్రధాని..

    కొత్తగా నిర్మించిన పార్లమెంట్ ను ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. దీనికి సంబంధించిన శిలాఫలాకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. కొత్త పార్లమెంట్‌ని జాతికి అంకితం చేశారు.

  • 28 May 2023 08:59 AM (IST)

    కొత్త పార్లమెంట్‌లో సర్వ మత ప్రార్థనలు..

    కొత్త పార్లమెంట్‌లో సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, క్యాబినెట్ మంత్రులు హాజరయ్యారు. అంతకుముందు సెంగోల్‌ను లోక్ సభ స్పీకర్ పోడియం వద్ద ప్రతిష్టించారు.

  • 28 May 2023 08:08 AM (IST)

    సాష్టాంగ నమస్కారం.. లోక్‌సభ స్పీకర్ చైర్ వద్ద సెంగోల్ ప్రతిష్టాపన

    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలో ప్రధాని మోదీ 'సెంగోల్' ముందు గౌరవ సూచకంగా నమస్కరించారు. ఆ తరువాత సెంగోల్‌ను లోక్ సభలో స్పీకర్ చైర్ వద్ద ప్రతిష్టించారు.

     

  • 28 May 2023 08:01 AM (IST)

    సెంగోల్‌ను ప్రధానికి అందచేసిన అధీనం పూజారులు

    ప్రధాని నరేంద్రమోడీకి రాజదండాన్ని(సెంగోల్)ను తమిళనాడు అధీనం పూజారులు అందించారు.

  • 28 May 2023 07:44 AM (IST)

    ప్రారంభమైన పూజా కార్యక్రమం

    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించి పూజా కార్యక్రమం ప్రారంభం అయింది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పూజలో పాల్గొన్నారు. దాదాపుగా  గంట పాటు పూజాకార్యక్రమం జరగనుంది. ఆ తరువాత ప్రధాని మంత్రి రాజదండం(సెంగోల్)ని స్వీకరించి కొత్త పార్లమెంట్ లో ప్రతిష్టించనున్నారు.

     

     

  • 28 May 2023 07:41 AM (IST)

    పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధాని మోడీ

    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభం అయింది. కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని నరేంద్రమోడీ చేరుకున్నారు. ఆయనతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు.

  • 28 May 2023 07:00 AM (IST)

    కొత్త పార్లమెంట్ కు బయలుదేరిన ఆధీనం పూజారులు

    తమిళనాడులోని వివిధ మఠాలకు చెందిన ఆధీనం పూజారులు కొత్త పార్లమెంట్ భవనానికి బయలుదేరారు. ప్రధాన మంత్రికి నిన్న రాజదండం(సెంగోల్) అందించారు.