NTV Telugu Site icon

Mohan Charan Majhi: నా భర్త సీఎం అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు: మోహన్ మాఝీ భార్య

Majhi

Majhi

Mohan Charan Majhi: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దశాబ్ధంగా ఒడిశాను పాలిస్తున్న నవీన్ పట్నాయక్‌ని అధికారాన్ని నుంచి దించింది. అసెంబ్లీలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్రంలోని ఎంపీ స్థానాలను దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసింది. ఇదిలా ఉంటే ఈరోజు ఒడిశా సీఎంగా బీజేపీ ఎమ్మెల్యే మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఒడిశా రాష్ట్రానికి మూడో గిరిజన ముఖ్యమంత్రిగా, బీజేపీ నుంచి తొలి ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ చరిత్ర సృష్టించారు.

తన భర్త ఒడిశా ముఖ్యమంత్రి అవుతారని తాము ఊహించలేదని మోహన్ మాఝీ భార్య ప్రియాంకా మాఝీ అన్నారు. తమ కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఊహించలేదని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. భువనేశ్వర్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో మోహన్ తల్లి, భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. మంగళవారం మాఝీని కొత్త సీఎంగా ప్రకటించడంతో ఒక్కసారిగా వారంతా ఆశ్యర్యం వ్యక్తం చేశారు. టీవీ ఛానెల్ ద్వారా ఈ విషయం తెలిసిందని, ఆ క్షణం వరకు తన భర్త సీఎం అవుతారని ఎప్పుడూ కూడా ఊహించలేదని ప్రియాంకా చెప్పారు.

Read Also: Bombay High Court : “భారత్‌ని ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర”.. పీఎఫ్ఐ సభ్యులకు బెయిల్ నిరాకరణ..

బీజేపీ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కుతుందని మాత్రమే ఊహించానని, ఇది నాకు, తమ కుటుంబానికి ఉత్కంఠభరితమైన క్షణమని చెప్పారు. ఈ ప్రకటన వచ్చే సమయంలో తాము వార్తా ఛానెల్‌ని చూస్తున్నట్లుగా ఆమె చెప్పారు. తన భర్త ఒడిశాకు, సొంత నియోజకవర్గం కియోంజర్‌కి మంచి చేస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తన కొడుకు సీఎం కావడం చాలా ఆనందంగా ఉందని మోహన్ మాఝీ తల్లి బలే మాఝీ అన్నారు. యువకుడి ఉన్న సమయంలో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చాడని, మొదట సర్పంచ్ అయ్యాడని, ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యాడని, ఇప్పుడు సీఎం అయ్యాడని ఆమె అన్నారు.

మా నాన్న సీఎం కావడం నాకు ఆశ్చర్యంగా ఉందని, స్నేహితులు తన నుంచి ట్రీట్ అడుగుతున్నారని 8వ తరగతి చదువుతున్న మాఝీ కుమారుడు కృష్ణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా మాఝీ సీఎం అయినందుకు మేమంతా సంతోషిస్తున్నామని, ఆయన చాలా వినయపూర్వక వ్యక్తి, ఖచ్చితంగా రాష్ట్రం కోసం పనిచేస్తారని సీఎం పొరుగు వారు చెప్పారు.