Israel: 9/11 దాడుల తర్వాత అమెరికా ఏం చేసింది, తాము కూడా అదే చేస్తున్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాపై అమెరికా స్పందించినట్లే తాము ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ పొలిటికల్ బ్యూరోపై దాడులు చేశామని సమర్థించుకున్నారు. ఖతార్, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న ఇతర దేశాల వారిని బహిష్కరించాలని లేదా వారిని న్యాయం ముందు నిలబెట్టాలని ఆయన అన్నారు. ‘‘మీరు అలా చేయకుంటే మేము చేస్తాం’’ అని నెతన్యాహూ అన్నారు. అంతర్జాతీయంగా ఈ దాడిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాని నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Read Also: Janhvi Kapoor : జాన్వీ కపూర్ సొగసుల వర్షానికి.. కుర్రాళ్లు రైన్ కోట్ వేసుకోవాలేమో
అక్టోబర్ 07 నాటి హమాస్ దాడిని, అమెరికాపై జరిగిన 9/11 దాడితో నెతన్యాహూ పోల్చారు. హమాస్ అధికారులకు దోహా సురక్షిత స్థావరంగా మారిందని ఆరోపించారు. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లోని అల్‌ఖైదా ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తూ, పాకిస్తాన్‌లో ఒసామా బిన్ లాడెన్‌ను చంపినట్లే మేము అదే చేస్తున్నామని, ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు ఇజ్రాయిల్‌ను నిందిస్తున్నాయని, వారు తమను తాము చూసి సిగ్గుపడాలని అని నెతన్యాహూ అన్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఇజ్రాయిల్‌ని అభినందించాలని చెప్పారు.
మంగళవారం ఇజ్రాయిల్ ఖతార్ రాజధాని దోహాపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. హమాస్ పొలిటికల్ బ్యూరో నేతలే టార్గెట్‌గా ఒక భవనంపై దాడులు చేసింది. అయితే, ఈ దాడిని పిరికిపంద చర్యగా ఖతార్ అభివర్ణించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సైనిక చర్య పట్ల అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయిల్ బందీలను విడిపించడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చే ప్రక్రియలో ఖతార్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఇజ్రాయిల్ దాడితో ఈ చర్చలు దెబ్బతినే అవకాశం ఉందని ఖతార్ హెచ్చరించింది.
