Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..

  • చైనాను కాదని, భారత పర్యటనకు వస్తున్న నేపాల్ ప్రధాని..
  • నవంబర్‌లో భారత్ వెళ్తారని నేపాల్ మీడియా కథనాలు..
Balendra Shah

Balendra Shah

Nepal: నేపాల్ ప్రధానిగా బాలెన్ షా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత పర్యటనకు రాబోతున్నట్లు నేపాల్ మీడియా నివేదించింది. బాలెన్ షా తన తొలి విదేశీ పర్యటన కోసం చైనాను కాదని, భారత్‌ను ఎంచుకున్నట్లు వెల్లడించింది. నవంబర్‌లో మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని, ఈ సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని సమాచారం. అయితే, తేదీల ఖరారు కావాల్సి ఉంది.

2026 మార్చిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బాలెన్ షా.. సెప్టెంబర్‌లో తొలిసారి దేశాన్ని వదిలి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం అమెరికా వెళ్లారు. అయితే, నవంబర్‌లో భారత్‌లో పర్యటిస్తే ఇదే ఆయన అధికారిక ద్వైపాక్షిక విదేశీ పర్యటన అవుతుంది. నేపాల్ లో ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఎవరైనా భారత్‌ను తమ తొలి విదేశీ పర్యటన కోసం ఎంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

గతంలో కొందరు ప్రధానులు మాత్రం దీనికి భిన్నంగా చైనాతో సంబంధాల కోసం వెంపర్లాడారు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి 2024లో డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌ను కాదని చైనా పర్యటనకు వెళ్లారు. భారత్ నుంచి ఆహ్వానం అందలేదని అప్పట్లో ఆయన పేర్కొన్నారు. పలు సందర్భాల్లో భారత్‌కు వ్యతిరేకంగా కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బాలెన్ షా పర్యటనలో మౌలిక సదుపాయాలు, ఇంధన ప్రాజెక్టులపై చర్చలు జరిగే అవకాశం ఉందని అక్కడి మీడియా వెల్లడించింది. భారత సహకారంతో నిర్మితమవుతున్న ప్రాజెక్టు చర్చలోకి వచ్చే అవకాశం ఉంది. భారత్-నేపాల్ మధ్య కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా సరిహద్దు వివాదం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.