Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్‌లో కనిపిస్తున్న మృతదేహాలు..

  • నేపాల్ వరద వినాశనం భారత్‌లో కనిపిస్తోంది..
  • గండక్ నదిలోకి కొట్టుకొస్తున్న మృతదేహాలు..
  • యూపీలోని జిల్లాల్లో 10 మృతదేహాలు లభ్యం..
Nepal Floods

Nepal Floods

Nepal flood:  నేపాల్ వరద విషాదం భారత్‌లో కనిపిస్తోంది. వినాశకమైన వరదల కారణంగా ఆ దేశంలో వందలాది మంది మరణించారు. చాలా మంది గల్లంతయ్యారు. ఇప్పుడు వారి మృతదేహాలు దిగువన ఉన్న భారత్‌లోని నదుల్లోకి కొట్టుకొస్తున్నాయి. గత రెండు రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో నదుల్లో 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. వరద ప్రభావిత నేపాల్ నుంచి భారత్‌కు ఈ మృతదేహాలు కొట్టుకొస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

నేపాల్ సరిహద్దును ఆనుకుని ఉన్న మహారాజ్ గంజ్, కుషీ నగర్ జిల్లాలోని గండక్ నదిలో ఆరు మృతదేహాలు లభించాయి. మృతుల వివరాలు, వారి కుటుంబాల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. మహారాజ్‌గంజ్ లో గురువారం నది ఉద్ధృత ప్రవాహంలో మూడు మృతదేహాలను గుర్తించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. నది, దాని పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్‌బీ) రెస్క్యూ బృందం మృతదేహాలను వెలికితీసి మార్చురీకి తరలించింది.

నేపాల్‌లో వరదలకు కారణమైన భోటేకోశీ, త్రిశూలి నది వ్యవస్థ నుంచి గండక్ నది భారత్ లోకి ప్రవేశిస్తుంది. టిబెల్‌లో పుట్టే భోటేకోశీ నది త్రిశూలి నదిలో కలుస్తుంది. ఆ తర్వాత ఈ నదీ వ్యవస్థ గండక్‌గా భారత్‌లోకి వస్తోంది. దీంతో నేపాల్ వరదల్లో చనిపోయిన వారి మృతదేశాలు ఈ నదిలో కనిపిస్తున్నాయి. కుషీనగర్ జిల్లాలో శుక్రవారం గండక్ నదిలో మరో మూడు మృతదేహాలు లభించాయి.

మృతదేహాలతో పాటు గండక్ నదిలోకి భారీగా శిథిలాలు, వాహనాలు, ఇంటి సామాగ్రి, గ్యాస్ సిలిండర్లు, డ్రమ్ములు, ఫర్నీచర్, చెట్ల దుంగలు వంటి వస్తువులు కొట్టుకొస్తున్నాయి. వీటిని తీసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు నది ఒడ్డుకు చేరుకుంటున్నారు. నది తీవ్రరూపం దాల్చడంతో అధికారులు వారిని హెచ్చరిస్తున్నారు.