NTV Telugu Site icon

Neet Exam: నీట్ పరీక్షకు సర్వం సిద్ధం.. నిమిషం ఆలస్యం అయినా అంతే ఇక..

Neet Exam

Neet Exam

Neet Exam: దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ కు సర్వం సన్నద్ధమైంది. ప్రతీ సంవత్సరం నీట్ ర్యాంకు ద్వారా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీవీఎస్, ఏహెచ్ సీట్లతో పాటు ఎయిమ్స్, జిప్‌మర్ సీట్లను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 543 నగరాలు, పట్టణాలతో పాటు విదేశాల్లో 13 నగరాల్లో నీట్ ఎగ్జామ్ నిర్వహణ ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..తెలంగాణ నుంచి 60 వేల మంది ఉన్నారు. తెలంగాణలో హైదరాబాద్ సహా మరో 25 సెంటర్లలో పరీక్షను నిర్వహిస్తున్నారు.

ఈ సారి పరీక్ష సమయాన్ని మరో 20 నిమిషాలు పెంచారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల 20 ప్రశ్నలు అధికంగా ఇచ్చినా.. పరీక్షా సమయాన్ని పెంచలేదు. ఈ సారి మాత్రం 200 నిమిషాల్లో 200 ప్రశ్నలకు గానూ 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 వరకు నీట్ పరీక్ష జరగనుంది. అయితే నిబంధనలు పాటించకున్నా.. నిమిషం ఆలస్యం అయినా.. పరీక్ష కేంద్రంలోపలికి అనుమతించమని ఎన్టీఏ ఇప్పటికే వెల్లడించింది. హిందీ, తెలుగులో పాటు 13 భాషల్లో పరీక్షను నిర్వహిస్తోంది.

Read Also: CM KCR Aerial Survey: మంపు ప్రాంతాల్లో సీఎం సర్వే.. పర్యటన షెడ్యూల్​ ఇలా..

నిమిషం నిబంధనతో పాటు మాల్ ప్రాక్టీసింగ్ వంటి చర్యలకు పాల్పడితే మూడేళ్లు డిబార్ చేయనున్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లేముందు అడ్మిన్ కార్డుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రాన్ని తప్పని సరిగా తీసుకెళ్లాలి. కోవిడ్ నేపథ్యంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఉంగరాలు, బ్రాస్ లెట్లు, చెవి పోగులు, ముక్కు పుడకలు, గొలుసులు, నెక్లెస్‌లు, హెయిర్‌పిన్, హెయిర్‌బ్యాండ్, తాయత్తులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, చేతి గడియారాలు, పెన్ను, పెన్సిల్, రబ్బరు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలకు పరీక్షా కేంద్రానికి తీసుకురావద్దని ఎన్టీఏ స్పష్టం చేసింది.

మంచినీళ్ల బాటిల్, ఆహార పదార్థాలను అనుమతించరు. అయితే అనారోగ్యంగా ఉన్నట్లు ఆధారాలు సమర్పిస్తే మందులు, నీళ్లబాటిల్ ను అనుమతిస్తారు. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నును ఎగ్జామ్ సెంటర్ లోనే ఇస్తారు. ఒక్కసారి పరీక్ష కోసం సెంటర్ లోపలికి వెళితే పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు అనుమతించరు. నెగిటివ్ మార్కులు ఉండటంతో అభ్యర్థులు ఖచ్చితమైన సమధానాలు మాత్రమే ఇవ్వాలి. ఒక వేళ ఎగ్జామ్ లో సమానమైన మార్కులు వస్తే నెగిటివ్ మార్కులు తక్కువగా ఉన్న వారికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలని ఇప్పటికే ఎన్టీఏ నిర్ణయించింది.