Site icon NTV Telugu

Union Minister Kiren Rijiju: కొలీజియ వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది..

Kiren Rijiju

Kiren Rijiju

Union Minister Kiren Rijiju: న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలిజీయం వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రక్రియపై ఆందోళనలు ఉన్నందున ఈ విషయంపై చర్చ జరగాల్సి ఉందన్నారు. అత్యున్నత న్యాయవ్యవస్థలో నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయని, అయితే “న్యాయ మంత్రి వల్ల కాదని, వ్యవస్థ కారణంగా” అని ఆయన అన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో న్యాయవాదుల సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సదస్సులో ‘సరికొత్త న్యాయ సమస్యలు’ అనే అంశంపై ప్రసంగిస్తూ ఉన్నత న్యాయవ్యవస్థలో పదవుల భర్తీ పెండింగ్‌లో ఉండడానికి వ్యవస్థలోని లోపాలే కారణం తప్ప, న్యాయమంత్రి కాదని అన్నారు. పదవుల భర్తీ త్వరగా జరిగేలా కొలీజియం వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉందని అన్నారు.

అనంతరం ఆయన వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా.. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అది అందరికీ తెలుసని, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానిపై తదుపరి చర్చ జరుగుతుందని, నా అభిప్రాయాలను అందరి ముందు ఉంచుతానని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం 2014లో న్యాయమూర్తుల నియామక విధానాన్ని మార్చేందుకు ప్రయత్నించింది. 2014లో తీసుకొచ్చిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమీషన్ (NJAC) చట్టం ఉన్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులను నియమించడంలో ఎగ్జిక్యూటివ్‌కు ప్రధాన పాత్రను కల్పించింది. కానీ దాన్ని 2015లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారత ప్రభుత్వానికి సమర్ధవంతంగా ప్రాతినిధ్యం వహించేందుకు వీలుగా అన్ని హైకోర్టుల్లో అదనపు సొలిసిటర్ జనరల్‌లను నియమిస్తామని శనివారం రిజిజు తెలిపారు.

JDU: ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త కాదు వ్యాపారవేత్త.. జేడీయూకు అవసరం లేదు

దేశంలోని న్యాయస్థానాలను డిజిటలైజ్ చేస్తున్నామని, దీనివల్ల ప్రజలు తమ కేసులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు దోహదపడుతుందన్నారు. హైకోర్టులు, దిగువ కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. లా అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశంలో 4.85 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ పెండింగ్‌ను పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

Exit mobile version