Maharashtra Election Results: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సునామీ సృష్టిస్తోంది. మహారాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఫలితాలు సాధిస్తోంది. మొత్తం 288 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఏకంగా 218 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. సొంతగా బీజేపీ 124 స్థానాల్లో, షిండే సేన 55 స్థానాలు, అజిత్ పవార్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కేవలం 58 స్థానాల్లో మాత్రమే అధిక్యంలో ఉంది.
Read Also: Student Suicide: మియాపూర్ లో విద్యార్థి ఆత్మహత్య.. అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు..
మహారాష్ట్రలో రెండు కారణాల వల్ల బీజేపీ కూటమి అఖండ విజయం దిశగా వెళ్తోంది. కులగణనకు వ్యతిరేకంగా మోడీ చేసిన ‘‘ఏక్ హైతో సేఫ్ హై’’ నినాదం మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రతిధ్వనించింది. దీనికి తోడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘‘బాటేంగేతో కటేంగే’’(విడిపోతే నష్టపోతం) అనే నినాదం కూడా పనిచేసింది. ఓబీసీలు, గిరిజనులు విడిపోతే నష్టపోతామని ప్రధాని మోడీ నినదించారు. దీనికి తోడు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘లాడ్కీ బహనా యోజన’’ బీజేపీ కూటమికి ఓట్ల వర్షాన్ని కురిపించింది. మహిళలకు నెలకు రూ. 2100 అందించే ఈ పథకం ఫుల్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.