Site icon NTV Telugu

Chhattisgarh: బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి..

Maoists

Maoists

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఇరు వర్గాల మధ్య ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజాపూర్ పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌‌ని భద్రత బలగాలు చేపడుతున్న సమయంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటన జరిగిన ప్రాంతం గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని పోలీస్ అధికారులు తెలిపారు.

హతమైన నక్సలైట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి హతమైన నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్, దంతేవాడ మరియు సుక్మా జిల్లాకు చెందిన 1200 మంది DRG, STF, COBRA మరియు CRPF సిబ్బంది నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌కు వెళ్లారు. ఉదయం 6 గంటల నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. అగ్రశ్రేణి నక్సల్స్‌ నేతలు ఉన్నారన్న సూచనతో ఈ ఆపరేషన్‌ను ప్రారంభించారు. బస్తర్ ఐజీ, మూడు జిల్లాల డీఐజీ, ఎస్పీలు ఆపరేషన్‌, ఎన్‌కౌంటర్‌పై నిఘా పెట్టారు. భద్రతా సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

Read Also: Night Shifts: కేవలం 3 నైట్ షిఫ్టులు చాలు షుగర్, ఊబకాయం రావడానికి.. అధ్యయనంలో వెల్లడి..

గత కొన్ని రోజులుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ అణిచివేత కార్యక్రమాలు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ 16న రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు 29 మంది నక్సలైట్లను హతమార్చాయి. దీంట్లో కీలకమైన మావోయిస్టు నేతలు మరణించారు. కాంకేర్ ఎన్‌కౌంటర్ తర్వాత సుక్మా జిల్లాలో ఆరుగురు నక్సలైట్లు లొంగిపోయారు. వీరందరిపై రూ. 36 లక్షలు రివార్డు ఉంది. ఏప్రిల్ 29న 23 మంది, ఏప్రిల్ 15న 26 మంది నక్సలైట్లు లొంగిపోయారు.

Exit mobile version