దేశవ్యాప్తంగా జరుగుతున్న అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ స్పందించారు. అగ్నివీరుల భవిష్యత్‌పై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదన్నారు. భవిష్యత్‌లో మనం కనిపించని శత్రువులపై యుద్ధాలు చేయాల్సిన అవసరం వస్తుందని.. ఈ నేపథ్యంలో దేశానికి యువత సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్నిపథ్‌ను సమర్థించిన అజిత్ ధోవల్.. యువ, సుశిక్షిత సేనలు దేశానికి అవసరమన్నారు. అగ్నిపథ్‌ను పథకాన్ని మరో కోణంలో చూడాలన్నారు. అగ్నిపథ్ అనేది 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు, భారతదేశాన్ని ఎలా సురక్షితంగా మార్చాలనేది ఆయన ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటని ఆయన వెల్లడించారు.
ఈ రెజిమెంటల్ వ్యవస్థ యధావిధిగా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ జరగుతున్న హింసాత్మక ఆందోళనలపై అజిత్ ధోవల్ ఆందోళన వ్యక్తం చేశారు. విధ్వంసం, హింసాకాండను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ధోవల్ హెచ్చరించారు, అగ్నిపథ్ నిరసనల వెనుక కొందరి స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయని.. సమాజంలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో కొందరు ఈ స్కీంను వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో పాల్గొన్న నిందితులను అధికారులు గుర్తించారని.. విచారణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.