Nagpur: నాగ్‌పూర్‌లో అత్యంత దారుణమైన గ్యాంగ్ ‘‘ఇప్పా గ్యాంగ్’’. ఈ గ్యాంగ్ లీడర్ భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు ఓ గ్యాంగ్ మెంబర్. ఇంకేముంది, తన లీడర్‌నే మోసం చేసిన వ్యక్తిని చంపేందుకు ఏకంగా 40 మంది కరడుగట్టిన హంతకముంఠా అతడి కోసం వెతుకుతోంది. సదరు మహిళ, తాను ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తితో బయటకు వెళ్లిన సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం ముఠా ఆగ్రహాన్ని మరింత పెంచింది.
ప్రస్తుతం, ఇప్పా గ్యాంగ్‌లోని 40 మంది నగరం, కాంప్టీ శివారు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. తమ లీడర్ భార్యతో రహస్యంగా సంబంధాన్ని కలిగి ఉన్న అర్షద్ టోపి అనే వ్యక్తిని చంపాలని నిర్ణయించుకున్నారు. గురువారం, టోపీ సదరు మహిళతో ప్రైవేట్ మీటింగ్‌కి వెళ్లినప్పుడు, బైక్‌పై ప్రయాణిస్తున్న వీరిని జేడీబీ ఢీకొట్టింది. టోపీ స్వల్పగాయాలతో తప్పించుకోగా, మహిళ తీవ్రంగా గాయపడింది.
Read Also: Serial killer: డ్రైవర్లను టార్గెట్ చేస్తూ చంపే సీరియల్ కిల్లర్.. 24 ఏళ్ల తర్వాత అరెస్ట్..
కోరాడి థర్మల్ ప్లాంట్‌కు చెందిన పెట్రోలింగ్ వాహనం సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది, అక్కడ ఆమెకు చికిత్స చేయడానికి నిరాకరించారు. ఆమెను కాంప్టీలోని మరో ఆసుపత్రికి తరలించారు, కానీ అక్కడ కూడా ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించారు. టోపి అంబులెన్స్ డ్రైవర్‌కు డబ్బు చెల్లించిన తర్వాతే ఆ మహిళను నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల – ఆసుపత్రి (GMCH)లో చేర్చారు, అక్కడ ఆమె శుక్రవారం ఉదయం గాయాలతో మరణించింది.
ఈ వార్త నగరంలో వ్యాపించింది. ఇప్పా గ్యాంగ్ టోపీని ద్రోహిగా ప్రకటించి, అతడిని చంపేయాలని ప్రతిజ్ఞ చేసిందని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. తమ గ్యాంగ్ లీడర్ భార్యను టోపీనే హత్య చేసి ఉండవచ్చని, ప్రమాదంతో ఆమె చనిపోలేదని గ్యాంగ్ నమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. లీడర్‌కి జరిగిన ద్రోహం, ఆయన భార్య మరణానికి ప్రతీకారంగా టోపీని చంపాలని గ్యాంగ్ నిర్ణయించుకుని పెద్ద ఎత్తున వేట కొనసాగిస్తోంది.
అయితే, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించిన టోపీ, శుక్రవారం తనకు రక్షణ కల్పించాలని పార్డిలోని డీసీపీ కార్యాలయానికి వెళ్లాడు. డీసీపీ అతడిని కొరాడి పోలీస్ స్టేషన్ పంపారు. అక్కడే అతడి వాంగ్మూలం నమోదు చేశారు. మహిళ ప్రమాదంలో చనిపోయిందని, హత్యకు గురైనట్లు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు.