Uttar Pradesh: హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం.. పోలీసులే పెళ్లి పెద్దలు..

  • యూపీలో వైరల్‌గా హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం..
  • ఇరు కుటుంబాలతో 6 గంటల పాటు చర్చించి ఒప్పించిన పోలీసులు..
Up Marriage

Up Marriage

Uttar Pradesh:  ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి పెళ్లి వైరల్‌గా మారింది. ఈ మతాంతర వివాహం ముందుగా రెండు వర్గాల్లో ఉద్రిక్తలు పెంచినప్పటికీ, చివరకు అమ్మాయి తండ్రి వివాహానికి ఒప్పుకోవడంతో శుభం కార్డ్ పడింది. మొత్తం ఈ వివాహంలో పోలీసులు పెళ్లి పెద్దలుగా నిలిచారు. ముస్లిం యువతి సానియా బానో, హిందూ యువకుడు అమన్ కుమార్‌ల కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. దావూద్‌పూర్‌ గ్రామానికి చెందిన ఇరు కుటుంబాలు ఇరుగుపొరుగున ఉంటాయి. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ముందుగా విషయం తెలుసుకున్న సానియా బానో తండ్రి ఖుర్షీద్ ఆలం పెళ్లికి నిరాకరించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్‌కు పిలిచి, దాదాపుగా 6 గంటల పాటు చర్చించి, ఇరు పక్షాలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. చివరకు తన కుమార్తె సంతోషమే ముఖ్యమని భావించిన ఖుర్షీద్ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని తర్వాత సానియా, అమన్ సమీపంలోని ఆలయంలో హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. తన ఇష్టపూర్వకంగానే అమన్‌ను పెళ్లి చేసుకున్నట్లు సానియా అఫిడవిట్ సమర్పించింది. భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా నోటరీ అఫిడవిట్ కూడా సిద్ధం చేశారు. గ్రామానికి చెందిన ఖుర్షీద్ ఆలం, అమర్ బహదూర్ ఈ వివాహానికి సాక్షులుగా నిలిచారు.

×
×
Ad

ఈ అంతర్-మత వివాహం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. వివాహ వేడుకకు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్‌లకు చెందిన అధికారులు, కార్యకర్తలు కూడా హాజరైనట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి మనీష్‌కుమార్‌ రావత్‌, బీజేపీ నేత విజయ్‌సింగ్‌ బజరంగీ, బజరంగ్‌ దళ్‌ జిల్లా సమన్వయకర్త ప్రిన్స్‌ బర్వాల్‌, శివకుమార్‌ సోని, కృష్ణపాల్‌, బబ్లూ గౌతమ్‌, నన్‌హే గౌతమ్‌, రాజేశ్‌ పాండే తదితరులు పాల్గొన్నారు.