NTV Telugu Site icon

Mars: అంగారకుడిపై బిలాలకు యూపీ, బీహార్ పట్టణాల పేర్లు..

Mars

Mars

Mars: అంగారకుడిపై రెండు బిలాలకు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని రెండు పట్టణాల పేర్లను పెట్టారు. ఈ గ్రహంపై గతంలో ఎప్పుడూ గుర్తించని మూడు బిలాలను అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ (IAU) ఈ క్రేటర్‌లకు మాజీ పీఆర్ఎల్ డైరెక్టర్‌తో పాటు చిన్న భారతీయ పట్టణాల పేర్లు పెట్టడానికి ఆమోదించింది.

అంగారకుడిపై ఉన్న థార్సిస్ అగ్నిపర్వత ప్రాంతంలోని ఉన్న మూడు క్రేటర్లను అధికారికంగా లాల్, క్రేటర్, హిల్సా క్రేటర్లుగా పేర్లు పెట్టారు. 1972 నుంచి 1983 వరకు ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) చీఫ్‌గా ఉన్న భారతీయ భూభౌతిక శాస్త్రవేత్త, మాజీ డైరెక్టర్ ప్రొ. దేవేంద్ర లాల్ గౌరవార్థం ‘‘లాల్ క్రేటర్’’గా పేరు పెట్టారు. లాల్ క్రేటర్‌కి తూర్పు అంచున 10 కి.మీ వెడల్పు ఉన్న బిలానికి ఉత్తర్ ప్రదేశ్‌లోని ముర్సన్ పట్టణం పేరు మీద ‘‘ముర్సన్ క్రేటర్’’గా నామకరణం చేశారు. లాల్ క్రేటర్ యొక్క పశ్చిమ అంచున ఉన్న మరో 10 కి.మీ వెడల్పు గల బిలం “హిల్సా క్రేటర్” అని నామకరణం చేయబడింది. హిల్సా పేరుతో బీహార్‌లో ఒక పట్టణం ఉంది.

Read Also: RBI: ఆర్బీఐ సంపాదనలో గణనీయమైన పెరుగుదల..పాకిస్తాన్ జీడీపీ కంటే 2.5 రెట్లు ఎక్కువ

లాల్ క్రేటర్ మొత్తం ప్రాంతం లావతో కప్పబడి ఉంది. మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్(ఎంఆర్ఓ) రాడార్ డేటా ప్రకారం.. బిలం నేల క్రింద 45 మీటర్ల మందపాటి అవక్షేపణ నిక్షేపాలని గుర్తించింది. ఇది ఒకప్పుడు మార్స్ ఉపరితలంపై నీరు ప్రవహించిందనే దానికి సాక్ష్యంగా నిలిచింది. నీరు ప్రవహించడం మూలం గానే లాల్ క్రేటర్‌లోకి అవక్షేపాలు జమ అయ్యాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఆవిష్కరణ అంగారక గ్రహం ఒకప్పుడు తడిగా ఉందని మరియు ఉపరితలంపై నీరు ప్రవహించిందని నిర్ధారిస్తుందని PRL డైరెక్టర్ డాక్టర్ అనిల్ భరద్వాజ్ చెప్పారు.

Show comments