NTV Telugu Site icon

Khalistani Pannun: “భారత్‌కి తిరిగి వెళ్లండి”.. కెనడా హిందూ ఎంపీకి టెర్రరిస్ట్ పన్నూ హెచ్చరిక..

Khalistanada

Khalistanada

Khalistani Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత వ్యతిరేకతను బయటపెట్టాడు. భారత్‌చే ఉగ్రవాదిగా గుర్తించబడిన సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ పన్నూ కెనడియన్ హిందూ ఎంపీ చంద్ర ఆర్యను టార్గెట్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. జూలై 28న కెనడాలోని కాల్గరీలో ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణకు ఓటింగ్ జరగుతుందని వీడియోలో పేర్కొన్నారు. అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూ తరుచుగా ఈ రెండు దేశాల్లో భారత వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల విధానాలను అవలంభిస్తున్నాడు.

ఇటీవల కాలంలో కెనడాలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఖలిస్తాన్ వేర్పాటువాదం, టెర్రరిజం గురించి పట్టించకోకపోవడాన్ని పలుమార్లు ఎంపీ చంద్ర ఆర్య అక్కడ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ముఖ్యంగా కెనడాలోని హిందూ ఆలయాలపై దాడులు, హింసాత్మక ఘటనపై గళం విప్పారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపుతున్నట్లుగా ఓ ర్యాలీలో ప్రదర్శించడం, ప్రధాని నరేంద్రమోడీపై ఇదే తరహాలో విద్వేషానికి పాల్పడటంపై కెనడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Read Also: Revanth Reddy: ముఖ్యమంత్రి ఆదేశాలతో గిరిజన అమ్మాయికి ఐఐటీకి వెళ్లేలా ప్రభుత్వం సాయం..

ఈ క్రమంలోనే పన్నూ తనను టార్గెట్ చేశాడని చంద్ర ఆర్య ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ ఎడ్మంటన్‌లోని హిందూ దేవాలయం BAPS స్వామినారాయణ్ మందిర్ విధ్వంసం మరియు కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారుల ఇతర ద్వేషం మరియు హింసాత్మక చర్యలపై నా ఖండనకు ప్రతిస్పందనగా, సిక్స్ ఫర్ జస్టిస్ గురుపత్వంత్ సింగ్ పన్నూ నన్ను నా హిందూ కెనడియన్లను భారతదేశానికి వెళ్లాలని ఓ వీడియో విడుదల చేశాడు’’ అని చంద్ర ఆర్య ఆ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇటీవల కెనడాలోని హిందూ దేవాలయాన్ని గ్రాఫిటీతో కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో దేశం ఖలిస్తాన్ తీవ్రవాదులతో కలుషితం అవుతోందని చంద్ర ఆర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పన్నూ స్పందిస్తూ.. ఆర్య, ‘‘మీ యజమానులైన భారతదేశ ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నారు’’ ఆరోపించాడు. మీ పౌరసత్వాన్ని విడిచిపెట్టి, మాతృభూమి భారత్ తిరిగి వెళ్లాంటూ కామెంట్ చేశాడు. మేము ఖలిస్తాన్ అనుకూల సిక్కులం దశాబ్ధాలుగా కెనడా పట్ల మా విధేయతను ప్రదర్శించామని పన్నూ వీడియోల పేర్కొన్నాడు.

పన్నూ వ్యాఖ్యలకు ప్రతిగా ఆర్య స్పందిస్తూ.. ‘‘మేము హిందువులం ప్రపంచంలోనే అన్ని ప్రాంతాల నుంచి మా అద్భుత దేశం కెనడాకు వచ్చాము. దక్షిణాసియాలోని ప్రతీ దేశం, ఆఫ్రికా, కరేబియన్ లోని అనేక దేశాలు, ప్రపంచంలోనే అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చామని, కెనడా మా దేశం’’ అని అన్నారు. మేము కెనడా సామాజిక-ఆర్థిక అభివృద్ధికి అపారమైన ఉత్పాదక సహకారాన్ని అందించామని, దీనిని కొనసాగిస్తున్నామని చెప్పారు హిందూ సంస్కృతి మరియు వారసత్వం ద్వారా కెనడా బహుళ సాంస్కృతిక విలువల్ని సుసంపన్నం చేశామని ఆర్య చెప్పారు.