More than half of the candidates in the Himachal elections are millionaires: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు అంతా సిద్ధం అయింది. నవంబర్ 12 అంటే రేపే హిమాలయ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. బీజేపీ అధికారంలోకి రావాలని మరోసారి అనుకుంటోంది. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీని గద్దె దించాలని పట్టుదలతో ఉంది. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఆస్తులు హాట్ టాపిక్ అయ్యాయి. అన్ని పార్టీలను కలుపుకుంటే దాదాపుగా సగాని కన్నా ఎక్కువ మంది కోటీశ్వరులే పోటీలో ఉన్నారు.
ఈ కోటీశ్వరుల జాబితాను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉంది. ఈ పార్టీ నుంచి పోటీలో ఉన్నవారిలో 90 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులే అని తేలింది. ఇక అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 82 శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఇక మరో ప్రధాన పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలో 52 శాతం మంది కోటీశ్వరులు ఉన్నట్లు తేలింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
Read Also: Gyanvapi mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఇక ఇతర పార్టీల విషయాన్ని పరిశీలిస్తే బీఎస్పీ తరుపు 53 స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. వీరిలో 25 శాతం అంటే 13 మంది అభ్యర్థులు కోట్లకు అధిపతులే. సీపీఎం అభ్యర్థుల్లో 36 శాతం ధనవంతులు ఉన్నారు. 45 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా శ్రీమంతులే కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీలో మొత్తం 68 మంది అభ్యర్థుల్లో 61 మంది.. బీజేపీలో 56 మంది కోటీశ్వరులు ఉన్నారు. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తున్న 412 మందిలో 55 శాతం(226మంది) కోటీశ్వరులే.
సిమ్లా నుంచి బీజేపీ తరుపున బరిలో ఉన్న బల్వీర్ సింగ్ వర్మ మొత్తం ఆస్తుల విలువ రూ. 128 కోట్లు.. ప్రస్తుతం ఈయనే అగ్రస్థానంలో ఉన్నారు. సిమ్లా రూరల్ నుంచి పోటీ చేస్తున్న విక్రమాదిత్య సింగ్ ( మాజీ సీఎం వీరభద్రసింగ్ కుమారుడు) ఆస్తివిలువ రూ. 101 కోట్ల ఉంది. కోటీశ్వరుల జాబితాలో విక్రమాదిత్య సింగ్ రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో కాంగ్రెస్ దివంగత నాయకుడు జీఎస్ బాలి కుమారుడు నగ్రోటా నుంచి పోటీ చేస్తున్న ఆర్ఎస్ బాలి ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ రూ. 96.36కోట్లు. ఇలాగే ప్రతీ పార్టీ నుంచి పోటీలో అభ్యర్థుల ఆస్తులు కోట్లలోనే ఉన్నాయి.