Site icon NTV Telugu

Asaduddin Owaisi: వాళ్ల ప్రాతినిధ్యం పెంచడానికే మహిళా రిజర్వేషన్ బిల్లు..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. ఇది కేవలం “సవర్ణ మహిళల”(అగ్రకుల మహిళలు) కోసమే ప్రవేశపెట్టిన బిల్లుగా అభివర్ణించారు. ఓబీసీ మహిళలకు, మహిళా కోటాలో రిజర్వేషన్ ఇవ్వనందుకు కేంద్రం తీరును తప్పుపట్టారు. ఎంఐఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తుందని చెప్పారు. మహిళా బిల్లును ‘‘చెక్ బౌన్స్ బిల్లు’’, ‘‘ఓబీసీ, ముస్లిం మహిళ వ్యతిరేక బిల్లు’’గా విమర్శించారు.

లోక్‌సభలో మాట్లాడిన ఓవైసీ.. కేంద్రం సవర్ణ మహిళల ప్రాతినిధ్యం పెంచాలని చూస్తోందని ఆరోపించారు. వారికి ఓబీసీ, ముస్లిం మహిళలు అక్కర్లేదని దుయ్యబట్టారు. 17వ లోక్ సభ వరకు మొత్తం 690 మంది మహిళా ఎంపీలు ఎన్నికైతే దీంట్లో కేవలం 25 మంది మాత్రమే ముస్లిం వర్గానికి చెందిన మహిళా ఎంపీలున్నారని తెలిపారు. హిందూ జాతీయ వాదాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ బీజేపీపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందూ మెజారిటీ, జాతీయవాదం పెరగడం హిందూ ఓటు బ్యాంకు ఏర్పడటం, ముస్లిం ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని, అది మరింగా తగ్గుతుందని మాకు తెలుసంటూ వ్యాఖ్యానించారు.

Read Also: Girlfriend Birth Day: యువకుడి ప్రాణాలు మీదికి తెచ్చిన గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే

1951, 1962, 1991, 1999లో పార్లమెంట్ లో ఒక్క ముస్లిం మహిళలు కూడా లేరని పేర్కొన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తిన ఓవైసీ, 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ కోటాలో ముస్లిం మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. సర్దార్ వల్లభబాయ్ పటేల్, నెహ్రూలు మైనారిటీలను మోసం చేశారని ఓవైసీ నిందించారు. జనాభాలో ముస్లిం మహిళలు 7 శాతం ఉంటే పార్లమెంట్ ప్రాతినిధ్యంలో 0.7 శాతం ఉందని ప్రస్తావించారు. ముస్లిం మహిళలు రెండు విధాలుగా వివక్షతను ఎదుర్కొంటున్నారని అన్నారు. తాను బీసిని అని చెప్పుకుంటున్న ప్రధాని మోడీ ఎంపీల్లో 120 మంది ఓబీసీలు ఉంటే 232 మంది అగ్రవర్ణ ఎంపీలు ఉన్నారని ఎద్దేవా చేశారు.

Exit mobile version