NTV Telugu Site icon

Karnataka Budget: ఆధునిక “ముస్లిం లీగ్” బడ్జెట్.. కర్ణాటక బడ్జెట్‌పై బీజేపీ విమర్శలు..

Karnataka Budget

Karnataka Budget

Karnataka Budget: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ బడ్జెట్‌పై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. బీజేపీ నేత జీఎస్ ప్రశాంత్ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌ని ‘‘ముస్లిం లీగ్ బడ్జెట్’’గా అభివర్ణించారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారీ కూడా ఈ బడ్జెట్‌ని తీవ్రంగా తప్పుపట్టారు. మైనారిటీల బుజ్జగింపు బడ్జెట్‌గా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Read Also: Fighter Jet Crash: జాగ్వార్ ఫైటర్ జెట్ క్రాష్.. పైలెట్ సురక్షితం..

బండారీ మాట్లాడుతూ.. ‘‘కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆధునిక ముస్లిం లీగ్ బడ్జెట్ ను ఆమోదించింది. ఈ ఆధునిక ముస్లిం లీగ్ బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ ఇమామ్ ల గౌరవ వేతనాన్ని రూ.6000 కు పెంచుతోంది. వక్ఫ్ కు రూ.150 కోట్లు ఇస్తున్నారు. ఆత్మరక్షణ శిక్షణ కోసం మైనారిటీ బాలికలకు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు… మైనారిటీ ప్రయోజనాల కోసం రూ.1000 కోట్లకు పైగా ఉపయోగిస్తున్నారు… నిన్న కర్ణాటక ప్రభుత్వం హుబ్బళ్లీ అల్లర్లపై కేసులను ఉపసంహరించుకోవాలని మాట్లాడింది. కాబట్టి, కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో ముహమ్మద్ అలీ జిన్నా ప్రభుత్వాన్ని ఎలా నడిపాడో అదే విధంగా ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇది రాజ్యాంగ విలువలను వెనక్కి తీసుకుంటోంది, మైనారిటీ వర్గాల ప్రయోజనాలకు సంబంధించిన ప్రకటనలు, విధానాలను మాత్రమే అమలు చేస్తోంది.’’ అని దుయ్యబట్టారు.

మరోవైపు బడ్జెట్ కేటాయింపుల్ని కాంగ్రెస్ నేతలు సమర్థించుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలపై ఎదురుదాడి చేసింది. కాంగ్రెస్ నేత రిజ్వాన్ అర్షద్ మాట్లాడుతూ..‘‘బడ్జెట్‌లో కొంత భాగాన్ని మైనారిటీలకు కేటాయించారు. మేము ఇంత కూడా అర్హులం కాదా..? బీజేపీ అన్ని విషయాలను హిందూ-ముస్లింలనుగానే చూస్తోంది’’ అని అన్నారు. జనాభాలో 15 శాతం మంది బడ్జెట్‌లో 1 శాతానికి కూడా అర్హులు కారా..? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మైనారిటీలను సమాజంగా చూడదని, వారు దేశ ఐక్యతను బలహీనపరచాలని అనుకుంటున్నారని, బీజేపీ దేశ వ్యతిరేకి అంటూ ఆరోపించారు.