Site icon NTV Telugu

Kamal Nath: “ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో 50 ఓట్లు రాలేదు”.. ఇది ఎలా సాధ్యం..

Kamal Nath

Kamal Nath

Kamal Nath: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. గత 2 దశాబ్ధాలుగా ఆ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో కొనసాగుతోంది. మరో 5 ఏళ్లు కూడా బీజేపీ అధికారంలో కొనసాగబోతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించింది. 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 163 స్థానాల్లో గెలవగా.. కాంగ్రెస్ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది.

ఇదిలా ఉంటే మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది ఎమ్యెల్యేలకు సొంత గ్రామాల్లో కూడా 50 ఓట్లు రాలేదని ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్ ఫలితాలపై ఈ రోజు ఆయన మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేస్తూ.. చిప్ ఉన్న ఏ మిషన్‌ని అయినా హ్యాక్ చేయవచ్చని అన్నారు.

Read Also: Skin Care : మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా? ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి..

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైంది. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన రెండు రోజుల తర్వాత ఈరోజు కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎంపీలో కాంగ్రెస్ ఓటమిపై కమల్ నాథ్, గెలిచిన ఓడిన అభ్యర్థులతో సమావేశం జరుపనున్నారు.

అయితే కొందరు కాంగ్రెస్ నేతలు ఈవీఎం హ్యాకింగ్‌కి పాల్పడ్డారని ఆరోపిస్తున్న నేపథ్యంలో.. కమల్ నాథ్ మాట్లాడుతూ, చర్చలు జరపకుండా ఒక నిర్ధారణకు రావడం సరికాదని, ముందుగా అందరితో మాట్లాడుతానని అన్నారు. అయితే ఎన్నికల్లో ప్రజల మూడ్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని, కొందరు ఎమ్మెల్యేలకు సొంత గ్రామాల్లో కనీసం 50 ఓట్లు రాలేదని, ఇది ఎలా సాధ్యం..? అని ప్రశ్నించారు.

తాము ప్రజా ఆదేశాన్ని అంగీకరిస్తున్నామని, ప్రతిపక్షంగా కాంగ్రెస్ తన బాధ్యత నిర్వహిస్తుందని కమల్ నాథ్ వెల్లడించారు. అలాగే ఎక్స్(ట్విట్టర్) ద్వారా బీజేపీని అభినందించారు. మరోవైపు ఎంపీలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ కమల్ నాథ్‌ని పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం.

Exit mobile version