Tamil Nadu hooch tragedy: తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం కాటుకు 56 మంది మరణించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే, సీఎం స్టాలిన్ నాయకత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కోలీవుడ్ యాక్టర్స్ సూర్య, విజయ్, కమల్ హాసన్ వంటివారు ఈ విషాదంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Canada: కెనడాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇది.. కాఫీ షాప్ ఉద్యోగం కోసం బారులు..
ఇదిలా ఉంటే, సీఎం స్టాలిన్‌పై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆ పార్టీ నేత కల్తీ మద్యం మరణాలు బీజేపీ కుట్రగా అనుమానించారు. డీఎంకేకి చెందిన ఆర్ఎస్ భారతీ మాట్లాడుతూ కళ్లకురిచి మద్యం మరణాలను అన్నామలై కుట్రగా అభివర్ణించారు. బీజేపీ పాలిత పదుచ్చేరి నుంచి మిథనాల్ తీసుకువచ్చి కల్తీ సారా తయారు చేసినట్లు చెప్పారు. ఈ ఘటన అన్నామలై పథకం ప్రకారం చేసిన కుట్ర అని డీఎంకే నేత వ్యాఖ్యానించారు.
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో జూన్ 18న కల్తీ మద్యం సేవించి 50 మందికి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై స్టాలిన్ రాజీనామా చేయాలని అన్నామలై డిమాండ్ చేశారు. దీని తర్వాత భారతీ మాట్లాడుతూ.. అన్నామలైపై ఆరోపణలు చేశారు. పుదుచ్చేరిలోని బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డార్జిలింగ్ రైలు ప్రమాదం తర్వాత రైల్వేమంత్రి రాజీనామా చేశారా..? నీట్ వ్యవహారంలో కేంద్రమంత్రి రాజీనామా చేశారా..? 2009లో కల్తీ మద్యం తాగి 137 మంది చనిపోతే నరేంద్ర మోడీ రాజీనామా చేశారా? అని భారతి ప్రశ్నించారు.