ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇక ముఖ్యమంత్రిగా ఉన్న ఎంకే.స్టాలిన్ అయితే ఘోరంగా ఓడిపోయారు. దీంతో డీఎంకేకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అనూహ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘనవిజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా నటుడు విజయ్ ముఖ్యమంత్రయ్యారు.
అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన 110 రోజుల తర్వాత ఓటమికి కారణాలు వెల్లడిస్తూ ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. పార్టీ కార్యకర్తల పాత్ర కూడా అందులో ఒకటని ఎంకే స్టాలిన్ అన్నారు. ‘‘మనం మన తప్పులను దాచుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా మనం మన తప్పులను అంగీకరించాలి. వాటిని బహిరంగంగా అందరి ముందు ఒప్పుకోవాలి. ఒక్క వ్యక్తి తప్పు చేసినా 75 ఏళ్ల పార్టీ దాని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుంది.’’ అని వ్యాఖ్యానించారు. అయితే స్టాలిన్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయానికి ఏ కార్యకర్త లేదా వ్యక్తి కారణమయ్యారో మాజీ ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పలేదు. అయితే స్టాలిన్ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
ఇక ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ మధ్య వివాదాల్లో చిక్కుకున్నారు. నటి త్రిషపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు డీఎంకేను ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీని తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్‌తో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇప్పుడు ఈ పరిణామాల మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై 110 రోజుల తర్వాత ఎంకే స్టాలిన్ ఇచ్చిన ప్రతిస్పందన అనేక ఊహాగానాలకు దారితీసింది.
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సంప్రదాయ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే రెండూ భారీ ఎదురుదెబ్బను చవిచూశాయి. విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలను గెలుచుకోగా…డీఎంకే కేవలం 73 స్థానాలకే పరిమితమైంది. ఏఐఏడీఎంకే 53 స్థానాలతో సరిపెట్టుకుంది.

