Site icon NTV Telugu

West Bengal: మైనర్ బాలికపై అత్యాచారం.. తృణమూల్ నేత కుమారుడిపై ఆరోపణలు..

West Bengal Incident

West Bengal Incident

West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నాడియా జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక తన ఇంట్లోనే అత్యాచారానికి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత కొడుకు ఈ దారుణానికి పాల్పడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, బీజేపీ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

సోమవారం తాను ఇంట్లో లేని సమయంలో, సమీప గ్రామానికి చెందిన నిందితుడు తన కుమార్తెను ఇంట్లోని పశువుల కొట్టానికి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. బాలిక ప్రస్తుతం శక్తినగర్ సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ‘‘2022 ఏప్రిల్ నెలలో పుట్టిన రోజు వేడుకల్లో 9వ తరగతి విద్యార్థినిపై టీఎంసీ నేత కొడుకు అత్యాచారం చేశాడు. తాజాగా నాడియాలోని శాంతిపూర్‌లో ఒక మైనర్ బాలికపై టీఎంసీ నేత కుమారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.’’ అని బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి ఈ ఘటనను ప్రస్తావిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Read Also: IPL 2024: కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమాని.. తాట తీసిన సిబ్బంది.. వీడియో వైరల్

ఏప్రిల్ 4, 2022న నిందితుడు ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆ సమయంలో బెంగాల్ రాజకీయాల్లో దుమారాన్ని రేపింది. ఐదు రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు పోలీసులకు వివరాలు తెలిపారు. నేరం జరిగిన అదే రాత్రి బాలిక తీవ్ర రక్తస్రావంతో మరణించింది. ఫిర్యాదు అందిన కొద్ది సేపటికే ప్రధాన నిందితుడు, టీఎంసీ నాయకుడు కుమారుడిని అరెస్ట్ చేశారు.

సందేశ్‌ఖాలీ, శాంతిపూర్, హంస్‌ఖాలీ నేరాలను ప్రస్తావిస్తూ బీజేపీ అధికార టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీఎంసీ నేతలు, వారి బంధువులు చేసిన లైంగిక నేరాలు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను తెలియజేస్తున్నాయని సువేందు అధికారి తన పోస్టులో పేర్కొన్నాడు. ఈ లైంగిక నేరస్తులకు చట్టం పట్ల భయం లేదని అన్నారు. తాజాగా నాడియా జిల్లా ఘటనలో నేరస్తుడు స్థానిక టీఎంసీ నేత కుమారుడని బీజేపీ ఆరోపించగా.. ఈ ఆరోపణలను టీఎంసీ తీవ్రంగా ఖండించింది. నిందితుడు, నిందితుడి తండ్రికి పార్టీలో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.

Exit mobile version