NTV Telugu Site icon

Advitiya Bal: పైలట్ కుటుంబానికి షాకింగ్ అనుభవం.. అతని త్యాగానికి గౌరవం ఇదేనా?

Advitya Bal

Advitya Bal

Advitiya Bal: భారత వైమానికదళం (ఐఏఎఫ్‌)కు చెందిన మిగ్‌-21 యుద్ధ విమానం కూలిన ఘటనలో పైలట్ అద్వితీయ భల్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో కన్న కొడుకు ప్రాణాలు కోల్పోయాడని తెలిసి ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన కుటుంబసభ్యులకు విమానంలో షాకింగ్‌ అనుభవం ఎదురైంది. కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని అందరికంటే ముందుగా విమానం నుంచి దింపేందుకు విమాన సిబ్బంది ప్రయత్నించగా తోటి ప్రయాణికులు కనీసం పట్టించుకోలేదు. దేశానికి సేవ చేసేందుకు పైలట్ ప్రాణాలు కోల్పోగా.. అతని కుటుంబాన్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం.

రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లాలోని బిమ్రా సమీపంలో గురువారం సాయంత్రం మిగ్‌-21 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్లు వింగ్ కమాండర్ ఎం రాణా, ఫ్లైట్ లెఫ్టినెంట్ అద్వితీయ భల్ మరణించారు. జమ్మూకు చెందిన 26 ఏళ్ల అద్వితీయ భల్ మరణవార్త తెలియగానే ఆయన కుటుంబం శోకసంద్రంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో భల్‌ మృతదేహాన్ని తీసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి జోధ్‌పూర్‌ వెళ్లారు. కాగా, మిగ్‌-21 ప్రమాదంలో చనిపోయిన ఫ్లైట్ లెఫ్టినెంట్ అద్వితీయ భల్ కుటుంబానికి ఆ విమానంలో చేదు అనుభవం ఎదురైంది. జోధ్‌పుర్‌లో విమానం ల్యాండ్‌ అయిన తర్వాత మూడో వరుసలో కూర్చున్న భల్‌ కుటుంబసభ్యులు మొదట దిగేందుకు సహకరించాలని కెప్టెన్‌ అనౌన్స్‌ చేశారు. వారి కుమారుడు మిగ్‌ ప్రమాదంలో మరణించారని, వారు త్వరగా దిగేందుకు సహకరించాలని కోరారు. కానీ, ఈ ప్రకటనను ఎవరూ పట్టించుకోలేదు. ముందు వరుసలో కూర్చున్న ప్రయాణికులు వినిపించుకోకుండా దిగడం ప్రారంభించారు. అయితే ఏ మాత్రం మానవత్వం, జాతీయత, సైనికుల పట్ల గౌరవం లేనట్లుగా కొందరు ప్రవర్తించారు. మొదటి రెండు వరుసల్లో ఉన్న ప్రయాణికులు కెప్టెన్‌ ప్రకటనను వ్యతిరేకించారు.

Drugs Burnt: ఒకేసారి 30 వేల కిలోల డ్రగ్స్‌ను తగలెట్టేశారు.. అంతా అమిత్ షా సమక్షంలోనే..

మరోవైపు ఆ కుటుంబంతోపాటు మూడో వరుసలో కూర్చున్న షేర్బీర్ పనాగ్ అనే ప్రయాణికు మరి కొందరు ప్రయాణికులు దీనిని ఖండించారు. కుమారుడ్ని కోల్పోయి పుట్టెడు దుఖంతో ఉన్న ఆ కుటుంబానికి దారి ఇవ్వాలంటూ పెద్దగా గళమెత్తారు. అనంతరం పనాగ్‌ ఈ విషయాన్ని ట్వీట్‌ చేశారు.‘ఫ్లైట్‌ లెఫ్టినెంట్ బాల్‌ కుటుంబసభ్యులు మూడో వరుసలో నా పక్కనే కూర్చున్నారు. విమానం ల్యాండ్‌ అవ్వగానే వారు ముందు దిగేందుకు సహకరించాలని కెప్టెన్‌ పదే పదే కోరారు. అయినా ముందు వరుసలోని వారు వినిపించుకోలేదు. నేను, ఇతర ప్రయాణికులు గట్టిగా అరిచినా పట్టించుకోకుండా స్వార్థంగా ప్రవర్తించారు. ఆ పైలట్ త్యాగానికి మనమిచ్చే గౌరవం ఇదీ!’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ వైరల్‌గా మారింది.