NTV Telugu Site icon

Bombay High Court: అర్ధరాత్రి నిమ్మకాయ కోసం మహిళ ఇంటి తలుపు తట్టడం అధికారికి తగునా..?

Bombay High Court

Bombay High Court

Bombay High Court: అర్ధరాత్రి ఒక మహిళ ఇంటి తలుపు తట్టిన అధికారి కేసును బాంబే హైకోర్టు విచారించింది. తప్పుడు ప్రవర్తన కారణంగా అతనిపై విధించిన జరిమానాను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. జస్టిస్ నితిన్ జామ్‌దార్, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ మార్చి 11న ఈ కేసును విచారించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కి చెందిన కానిస్టేబుల్ ఈ ఘటనకు పాల్పడ్డాడని, అంతకుముందు మద్యం సేవించి ఉన్నాడని, తన సహోద్యోగి అయిన మహిళ భర్త పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధుల్లో ఉన్నాడని తెలుసుకుని ఇలా తప్పుగా ప్రవర్తించాడని కోర్టు పేర్కొంది.

జూలై 2021, జూన్ 2022 మధ్య సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తప్పుడు ప్రవర్తన కారణంగా జరిమానాను విధించడాన్ని సవాల్ చేస్తూ సదరు కానిస్టేబుల్ అరవింద్ కుమార్(33) పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో అతను ముంబైలోని BPCL (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్)లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతని జీతం మూడు సంవత్సరాలకు తగ్గించబడింది. ఆ సమయంలో అతనికి శిక్షగా ఎలాంటి ఇంక్రిమెంట్ లభించదు.

Read Also: IBM layoffs: కేవలం 7 నిమిషాల మీటింగ్‌లోనే ఉద్యోగుల లేఆఫ్.. ఐబీఎం షాకింగ్ నిర్ణయం..

అధికార నివాస గృహంలో 2021 ఏప్రిల్ 19-20 మధ్య రాత్రి అరవింద్ కుమార్, ఆరేళ్ల కుమార్తెతో నివసిస్తున్న మహిళ ఇంటి తలుపు తట్టాడని ఆరోపణలు వచ్చాయి. తన భర్త ఇంట్లో లేరని తనను ఇబ్బంది పెట్టొద్దని సదరు మహిళ అతనికి చెప్పింది. మహిళ హెచ్చరించడంతో అతను అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే, ఆ సమయంలో తనకు అనారోగ్యం ఉందని, అందుకే నిమ్మకాయల కోసం ఇరుగుపొరుగు ఇంటి వాళ్లను అడిగానని చెప్పాడు.

ఈ ఘటనకు ముందు అతను మద్యం సేవించి ఉన్నాడని, ఆ సమయంలో మహిళ భర్త ఇంట్లో లేడనే విషయం కూడా తెలుసని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంట్లో భర్త లేడని తెలిసి తన ఆరేళ్ల కూతురితో పొరుగింటిలో ఉన్న మహిళ ఇంటి తలుపు తట్టడం, దానికి కడుపు నొప్పి అనే అనే పనికిమాలిన సాకుతో నిమ్మకాయలు కావాలని అడగడం అసహ్యకరమైనదని హైకోర్టు పేర్కొంది. ఇలాంటి ప్రవర్తన సీఐఎస్ఎఫ్‌లో పనిచేస్తున్న అధికారికి తగనిదని పేర్కొంది. ఈ సంఘటన జరిగిన సమయంలో అతను డ్యూటీలో లేనందున ఈ సంఘటన దుష్ర్పవర్తనకు సమానం కాదనే అతని వాదనను హైకోర్టు నిరాకరించింది.