Delhi results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్‌ని ఉడ్చిపడేస్తోంది. గత దశాబ్ధ కాలంగా ఢిల్లీని పాలిస్తున్న అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ ఓటర్లు షాక్ ఇచ్చారు. 27 ఏళ్ల తర్వాత బీజేపీకి తిరిగి పట్టం కట్టబోతున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు మధ్యతరతగతి, పూర్వాంచలి ఓటర్లు మద్దతు ఇచ్చారు. గతంలో ఈ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మద్దతుగా నిలిచారు. ఈసారి మాత్రం ఆప్‌ని యమునలో ముంచారు.
Read Also: Delhi Assembly Elections: మూడో‘సారి’ కాంగ్రెస్ డకౌట్.. మళ్లీ రిక్త హస్తమే..
పశ్చిమ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, మధ్య ఢిల్లీ, న్యూఢిల్లీ అంతటా మధ్యతరగతి ఆధిపత్యం ఉన్న చాలా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కనిపించింది. ఇదే విధంగా తూర్పు యూపీ, బీహార్ నుంచి వచ్చిన పూర్వాంచలి ఓటర్లు గణనీయమైన ప్రభావాన్ని చూపగలిగే 25 స్థానాల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. అనధికారిక కాలనీలు కలిగిన ట్రాన్స్ యమునా ప్రాంతంలోని 20 సీట్లలో బీజేపీ 10 సీట్లకు పైగా ఆధిక్యంలో ఉంది.
ఢిల్లీలో దాదాపుగా 40 శాతం మంది ఆప్ పాలనపై అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల బడ్జెట్‌లో మధ్యతరగతి వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆదాయపన్ను పరిమితిని పెంచడం వంటి అంశాలు బీజేపీ గ్రాఫ్ పెరిగేందుకు కారణమైంది. ఇక పూర్వాంచలి ఓటర్లు 30 శాతం మంది ఉన్నారు. వీరు కూడా బీజేపీ వైపు మళ్లినట్లు ఫలితాల సరళిని చూస్తే తెలుస్తోంది.