Mehbooba Mufti: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో 9 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు డాక్టర్లుగా ఉంటూనే ఉగ్రవాదానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ స్పందించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్ల తల్లిదండ్రుల్ని విచారణ పేరుతో ‘‘వేధించవద్దు’’ అని అన్నారు.
గతంలో కూడా ముఫ్తీ ఇలా నిందితులకు మద్దతు ఇచ్చేలా మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా ఆమె ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను విమర్శిస్తూ మాట్లాడారు. పాకిస్తాన్‌తో చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సైనిక కేంద్రీకృత విధానాన్ని విడిచిపెట్టాలని కోరారు. తాజాగా, మరోసారి ఢిల్లీ ఉగ్రదాడిపై కూడా ఇలాగే తన సున్నిత వైఖరిని చూపించారు.
Read Also: Hyderabad: రెడ్ లైట్ ఏరియాగా మారిన శ్రీశైలం హైవే? పట్టించుకోని పోలీసులు..!
ఢిల్లీ పేలుడు ఘటనపై స్పందిస్తూ.. మృతులకు సంతాపాన్ని వ్యక్తి చేశారు. దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో నిందితులు దోషులుగా తేలితే తప్పా వారిపై దుర్భాషలాడకూడదని, ఇది వారి కుటుంబాలను బాధపెడుతుందని ఆమె అన్నారు. శ్రీనగర్ విలేకరుల సమావేశంలో బుధవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనపై న్యాయపరమైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
‘‘ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లను నేను ఖండిస్తున్నాను. మన విద్యావంతులైన వైద్యులు బాధపడుతున్నారు. ఢిల్లీ పేలుడుపై పూర్తి , న్యాయమైన దర్యాప్తు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ దాడిలో వైద్యులు ప్రమేయం ఉంటే, అది మనందరికీ చాలా హానికరం. అరెస్టయిన డాక్టర్ల తల్లిదండ్రుల్ని వేధించవద్దు. వారి ప్రమేయం లేదు. ఘటనలో పాల్గొన్న వారిని శిక్షించాలి. కానీ అమాయకులనను వేధించవద్దు’’ అని ముఫ్తీ అన్నారు.
మరోవైపు, ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా భద్రతా , దర్యాప్తు సంస్థల నుండి అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఢిల్లీ పోలీసులు NIA, NSG, IB , స్థానిక పోలీసులతో కలిసి 500 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో సోదాలను ముమ్మరం చేశారు.
