Mehbooba Mufti criticizes BJP: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడీపీ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ గురువారం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో స్థానికులను నిర్వీర్యం చేయడానికి బీజేపీ పార్టీ ఇజ్రాయిల్ తరహా విధానాన్ని అవలంభిస్తోందని విమర్శించారు. స్థానికేతరులకు ఓటు కల్పించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఎన్నికల్లో బీజేపీ గెలిచే కుట్రగా అభివర్ణించారు. కాశ్మీర్ లో పడే ప్రతీ రక్తపు చుక్కను బీజేపీ క్యాష్ చేసుకుంటోందని విమర్శించారు. బీజేపీ వారు దేశాన్ని హిందూ దేశంగా కాకుండా.. బీజేపీ దేశంగా మార్చాలని అనుకుంటున్నారని విమర్శించారు.
జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులకు ఓటు హక్కుతో పాటు 25 లక్షల మంది తాజాగా కొత్త ఓటర్లను చేర్చే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లోని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాశ్మీరీ పండిట్ అయినా.. స్థానికేతరుడైనా, ఉగ్రవాది అయినా, ఇండియన్ ఆర్మీ అయినా జమ్మూ కాశ్మీర్ లో చిందే ప్రతీ రక్తపు బొట్టుతో బీజేపీ ప్రయోజనం పొందుతోందని ఆమె విమర్శించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతీ హత్యను బీజేపీ సొమ్ము చేసుకుంటోందని.. జమ్మూ కాశ్మీర్ శాంతిని కోరుకోవడం లేదని అన్నారు.
Read Also: Addanki Dayakar: బీజేపీ కుట్రలో శశిధర్ రెడ్డి పావులౌతున్నారు
బీజేపీ ఎన్నికల రిగ్గింగుకు పాల్పడుతోందని ఆమె మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. రిగ్గింగ్ అనేది బీజేపీలో భాగం అయిపోయిందని ఆరోపించారు. అధికారం కోసం డబ్బును, అధికారాన్ని వినియోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేయడం ద్వారా దేశం మొత్తంలో అధికారాన్ని పొందాలనేదే బీజేపీ ఉద్ధేశం అని ఆమె విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ ను బీజేపీ ఓ ప్రయోగశాలగా మార్చారని.. బీజేపీ జాతి ప్రయోజనాల కోసం ఏం చేయడం లేదని ఆమె ఆరోపించారు. త్వరలో జాతీయ పతాకాన్ని కూడా కాషాయరంగులోకి మారుస్తారని ఆమె విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ నాజీ జర్మన్ విధానాన్ని అమలు చేస్తోందని.. పాలస్తీనాలో ఇజ్రాయిల్ చేసిన విధంగానే స్థానికులను నిర్వీర్యం చేస్తుందని బీజేపీని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.