మరోసారి కేంద్ర కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు సాగుతున్నాయి.. దీనికి ముఖ్యకారణంగా.. ప్రధాని నివాసంలో కీలక సమాలోచనలు జరగడమే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలు సుదీర్ఘ మంతనాలు జరిపారు.. దీంతో.. ఓ వారం రోజుల్లో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.. గత ఏడాది కాలంగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ పై ఊహాగానాలు కొనసాగుతుండగా.. దేశంలో “కరోనా” విజృంభణ, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఒకటి కి మించి మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు తోమర్, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాన్, ప్రకాశ్ జావడేకర్ లాంటి కేంద్ర మంత్రులు. దీంతో.. కేంద్ర మంత్రి వర్గంలో “అప్నాదళ్” నేత అనుప్రియ పటేల్, బీహార్ నుంచి బిజేపి నేత సునీల్ మోడి, ఇటీవలే బిజేపి లో చేరిన జ్యోతిరాదిత్య సింధియా, జేడి-యు కి చెందిన ఇరువురు నేతలకు చోటు లభించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
నిన్న సాయంత్రం కూడా పలు మంత్రిత్వశాఖల పనితీరుపై దాదాపు 5 గంటలకు పైగా సమీక్ష జరిగింది.. నిన్నటి సమావేశంలో ఉక్కు, పెట్రోలియం శాఖ, జలశక్తి శాఖ, నైపుణ్యాభివృధ్ది శాఖ, పౌర విమానయాన శాఖ, భారీ పరిశ్రమలు, పర్యావరణ శాఖల పనితీరు పై ఆయా శాఖల మంత్రులతో సమీక్ష నిర్వహించారు ప్రధాని మోడీ.. ఈ రోజు సమావేశంలో కూడా పలువురు మంత్రులు పాల్గొన్నట్టు సమాచారం. ఇది మామూలు గా ప్రతి ఏడాది జరిగే సమీక్ష సమావేశాలేనని అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రధాని మొత్తం 79 కేంద్ర మంత్రులను నియామకం చేసే అవకాశం ఉండగా, ఇంకా రెండు డజన్లు కు పైగా ఖాళీలు ఉన్నాయి.. రెండవ విడత “కరోనా” విజృంభణ ను అడ్డుకోవడంలో ప్రధాని తీవ్ర వైఫల్యం చెందారని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మొదలైన సమీక్ష సమావేశాలు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట ను మెరుగుపరుచుకునేందుకు మరో సరికొత్త కేంద్ర పథకాన్ని అతి త్వరలో ప్రారంభించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై కీలక చర్చ సాగినట్టు సమాచారం.. ఢిల్లీకి వెళ్లిన సీఎం యోగి ఆదిత్యానాథ్.. ప్రధాని, అమిత్‌షా, జేపీ నడ్డాలు కలసి వెళ్లారు.. దీంతో.. ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గంలోనూ మరికొన్ని మార్పులు చేర్పులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.. వచ్చే ఫిబ్రవరి లో జరగనున్న యు.పి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర మంత్రి వర్గంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారని సమాచారం.. ఏ క్షణంలో నైనా యు.పి మంత్రివర్గ విస్తరణ జరగనుండగా.. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు.యూపీ బీజేపీలో కూడా సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.