ప్రొఫెసర్ల వేధింపులకు విద్యాకుసుమాలు రాలిపోతున్నాయి. మొన్నటికి మొన్న ఒడిశాలో అధ్యాపకుల వేధింపుల కారణంగా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మరువక ముందే గ్రేటర్ నోయిడాలోని శారద యూనివర్సిటీలో దంద వైద్య విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనలు మరువక ముందే తాజాగా రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు అధ్యాపకులే కారణం అని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఇది కూడా చదవండి: Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం
ఉదయపూర్‌లోని మెడికల్ కాలేజీలోని హాస్టల్ గదిలో శ్వేతా సింగ్ అనే విద్యార్థిని ఉరివేసుకుని చనిపోయింది. ఈ మేరకు శుక్రవారం అధికారులు వెల్లడించారు. గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌కు చెందిన బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న శ్వేతా సింగ్ ఆత్మహత్య చేసుకుంది. రూమ్మేట్ చూసినప్పుడు ఉరివేసుకున్నట్లు గుర్తించింది. అనంతరం హాస్టల్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేసింది. అధ్యాపకులు… విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారని, సకాలంలో పరీక్షలు నిర్వహించడం లేదని శ్వేతా సింగ్ ఆరోపించిన సూసైడ్ నోట్ దొరికిందని అధికారులు తెలిపారు. దీంతో ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కళాశాల దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు. రోడ్డును దిగ్బంధించారు. దీంతో కళాశాల డైరెక్టర్ రంగంలోకి దిగి విద్యార్థులతో చర్చలు జరిపి.. సూసైడ్ నోట్‌లో ఉన్న అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది.. ఈసీ తీరుపై సిద్ధరామయ్య ఆరోపణలు
ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కళాశాల యాజమాన్యం కూడా పరిస్థితిని పరిష్కరిస్తోందని వెల్లడించారు. ఇప్పటికే సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించారు. విద్యార్థిని మృతదేహాన్ని మార్చురీకి తరలించామని, కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని సుఖేర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రవీంద్ర చరణ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Vijay : క్లాసిక్ హిట్ సినిమాను రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ
