NTV Telugu Site icon

Bengaluru: భార్య వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో..

Atul Subhash

Atul Subhash

Bengaluru: భార్య వేధింపులతో విసిగిపోయిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూర్‌లో జరిగింది. 34 ఏళ్ల అతుల్ సుభాష్ అనే వ్యక్తి బెంగళూర్‌లో తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూర్ పోలీసులు సూసైడ్ నోట్‌ని కనుగొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా ఎక్స్‌లో ట్రెండ్‌ అవుతోంది. అతుల్‌కి న్యాయం చేయాలంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. బీహార్‌కి చెందిన అతుల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బెంగళూర్‌లోని మంజునాథ్ లేఅవుట్‌లో నివాసం ఉంటున్నారు. చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియోని చూస్తే అతుల్ ఎంతటి క్షోభ అనుభవించాడనేది తెలియజేస్తోంది. ప్లాట్‌లో ‘‘న్యాయం జరగాలి’’ అనే ప్లకార్డుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అతుల్ నుంచి విడిపోయిన భార్య, అతడి తల్లిదండ్రులపై తప్పుడు కేసు పెట్టిందని, దీంతో ఆయన మానసికంగా కుంగిపోయినట్లు సోదరుడు బికాస్ కుమార్ పోలీసులకు తెలిపారు. అతుల్ తన భార్య, ఉత్తర్ ప్రదేశ్ ఔన్‌పూర్ న్యాయమూర్తిపై వీడియోలో ఆరోపణలు చేశాడు. తప్పుడు కేసులతో న్యాయవ్యవస్థ వేధించడంపై ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు. మరో నోట్‌లో తన భార్య తనపై మోపిన అన్ని అభియోగాల్లో తాను నిర్దోషి అని చెప్పాడు. అతుల్ భార్య, అతడిపై వరకట్న నిషేధం, క్రూరత్వం వంటి కేసులు పెట్టిందని, ఈ తప్పుడు కేసుల్లో తన తల్లిదండ్రుల్ని, సోదరుడిని వేధించడం మానుకోవాలని కోర్టును కోరారు.

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన రికార్డ్ చేసిన వీడియో, వదిలిపెట్టిన నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా 2019లో తన కుమారుడు వివాహం చేసుకున్నట్లు అతుల్ తల్లిదండ్రులు తెలిపారు. వీరిద్దరికి ఏడాది తర్వాత కుమారుడు జన్మించాడు. తన భార్య కుటుంబీకులు లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసేవారని అతుల్ ఆరోపించారు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో, అతుల్ భార్య 2021లో కొడుకుతో కలిసి బెంగళూర్ నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది.

Read Also: Syria-Israel: సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. రెబల్స్ లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం

ఏడాడి తర్వాత, తనపై తన కుటుంబపై హత్య, అసహజ సెక్స్‌తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అతుల్ సూసైడ్ నోట్‌లో చెప్పారు. కేసుని పరిష్కరించడానికి భార్య, ఆమె కుటుంబం మొదటగా రూ. 1 కోటి, ఆ తర్వాత దానిని రూ. 3 కోట్లకు పెంచారని అతుల్ చెప్పారు. తన భార్య, బిడ్డకు భరణంగా నెలకు రూ. 80,000 చెల్లించాలని కోర్టు కోరగా, ఆమె నెలకు రూ. 2 లక్షలు డిమాండ్ చేసిందని చెప్పారు. కోర్టు విచారణలో సందర్భంగా.. తప్పుడు కేసులతో మగాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జడ్జికి చెప్పగా, తన భార్య ‘మీరేందుకు చేసుకోరు’ అని చెప్పిందని, దీనికి జడ్జ్ నవ్వుతూ ఆమెని రూం నుంచి బయటకు వెళ్లమని చెప్పాడని, తన కుటుంబం గురించి ఆలోచించాలని న్యాయమూర్తి చెప్పాడని, కేసుని పరిష్కరించుకోవడానికి రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడని అతుల్ ఆరోపించారు.

‘‘తన అత్తగారు కూడా ‘‘నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవడం లేదు’’ అని చెప్పిందని, అయితే, తాను చనిపోతే మీకు డబ్బు ఎలా వస్తుందని తాను ప్రశ్నిస్తే.. మీ అమ్మానాన్నలు చెల్లిస్తారని, వారు చనిపోయిన తర్వాత నీ భార్యకు డబ్బులు వస్తాయని చెప్పినట్టు’’ అతుల్ ఆరోపించారు. తన భార్య వెళ్లిపోయినప్పటి నుంచి తన భార్య,ఆమె కుటుంబం తన కొడుకును కలవనివ్వలేదని అతుల్ వాపోయాడు. మొత్తం న్యాయవ్యవస్థ వేధించే వారిని ప్రోత్సహిస్తోంది, నేను వెళ్లిపోయిన తర్వాత, డబ్బు అనేది ఉండదు, తన వృద్ధ తల్లిదండ్రులను, సోదరుడిని వేధించేందుకు కారణం ఉండదు అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

Show comments