NTV Telugu Site icon

Amit Shah: కాశ్మీర్‌కి ‘‘ఋషి కశ్యప’’ పేరు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

Amit Shah

Amit Shah

Amit Shah: కాశ్మీర్‌కి హిందూమతంలో గౌరవనీయులైన ఋషి కశ్యపుడి పేరు పెట్టడం సాధ్యమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం అన్నారు. ఢిల్లీలో ‘‘జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజెస్’’ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాశ్మీరు కశ్యపుడి భూమి అని మనందరకి తెలుసు, కాశ్మీర్‌కు ఋషి కశ్యపుడి పేరు పెట్టే అవకాశం ఉంది అని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిందని, సరైన విషయాలను ప్రజలకు అందించాలని అన్నారు. “భారతదేశ అభివృద్ధికి జమ్మూ కాశ్మీర్ గణనీయంగా దోహదపడింది. మేము కాశ్మీర్ యొక్క సాంస్కృతిక వైభవాన్ని సాధిస్తాము,” అని చెప్పారు.

Read Also: Adani bribery case: అదానీకి అమెరికా షాక్.. సంయుక్త విచారణకు ఆదేశం..

భౌగోళిక, రాజకీయ సరిహద్దులు కాకుండా సాంస్కృతిక సరిహద్దులు ఉన్న ఏకైక దేశం భారతదేశమే అని అమిత్ షా అన్నారు. కాశ్మీర్‌లో శంకరాచార్య, సిల్క్ రూట్, హేమిష్ మఠం భారతీయ సంస్కృతితో ముడిపడి ఉందని చెప్పారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, అలాగే ఉంటుందని షా పునరుద్ఘాటించారు. లడఖ్‌లోని దేవాలయాలను ధ్వంసం చేయడం, కాశ్మీర్‌లో సంస్కృతం ఉపయోగించడం భారతీయ నాగరికతతో ఈ ప్రాంతానికి ఉన్న లోతైన సంబంధానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం జరిగిన పొరపాట్లను కూడా ఈ పుస్తకం ప్రస్తావించిందని చెప్పారు.

కాశ్మీర్‌లో ప్రత్యేక హక్కులను కల్పించిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏని అమిత్ షా విమర్శించారు. ఈ నిబంధనలు దేశం ఐక్యంగా ఉండకుండా నిరోధించాయని చెప్పారు. ఈ నిబంధనలను నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తొలగించి, కాశ్మీర్ అభివృద్ధికి మార్గం సుగమం చేసిందని అన్నారు. ఆర్టికల్ 370 కశ్మీరీలలో వేర్పాటువాద బీజాన్ని నాటిందని, వీటి తొలగింపు తర్వాత లోయలో ఉగ్రవాదం తగ్గిందని అమిత్ షా చెప్పారు. కేంద్రం ప్రభుత్వం 2019 ఆగస్టులో ఈ రెండు ప్రత్యేక ఆర్టికల్స్‌ని తొలగించింది.

Show comments