Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..

Mayawati

Mayawati

Mayawati: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి మరోసారి సంచలన నిర్ణయంతో రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశారు. పార్టీలో కుటుంబ పాలనకు తావులేదని నినదిస్తూనే.. తన సోదరుడు ఆనంద్ కుమార్ కుమారులను రాజకీయ బాధ్యతలకు శాశ్వతంగా దూరం పెడుతున్నట్లు కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో ఆయన కుమార్తె, న్యాయవిద్య అభ్యసిస్తున్న కుమారి దీపికా ఆనంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించే సూచనలు ఇవ్వడం ద్వారా సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపారు.

కొడుకులకు దక్కని పగ్గాలు.. తెరపైకి కుమారి దీపిక

బీఎస్పీని కుటుంబ పాలన జాడ్యం నుంచి కాపాడటమే తన పరమ లక్ష్యమని మాయావతి స్పష్టం చేశారు. అవివాహితురాలినైన తనకు భద్రత అవసరాల రీత్యా తోడుగా ఉన్న సోదరుడు ఆనంద్ కుమార్ కుమారులెవరికీ.. బీఎస్పీలో చిన్న, పెద్ద ఎలాంటి పదవులూ ఇచ్చే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు. అంతేకాదు, భవిష్యత్తులో వారి సంతానానికి కూడా పార్టీలో స్థానం ఉండదని కఠిన నిబంధన విధించారు. అయితే ఆనంద్ కుమార్‌కు సాయం చేసే నెపంతో ఆయన కుమార్తె దీపికా ఆనంద్ రాజకీయ అరంగేట్రానికి మాత్రం పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిజాయితీ, విధేయత, పనితీరు ఆధారంగా ఆమెకు బాధ్యతలు కట్టబెట్టవచ్చని, ఒకవేళ దీపిక అందుకు ముందుకు రాకపోతే బహుజన్ సమాజానికి చెందిన నిబద్ధత కలిగిన మిషనరీ కార్యకర్తకే ఆ అవకాశం దక్కుతుందని వెల్లడించారు.

జెన్-జీ, జెన్-ఆల్ఫాపై దృష్టి.. 50 శాతం యువతకే పెద్దపీట

రాబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త తరం యువ నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు మాయావతి తెలిపారు. జెన్-జీ, జెన్-ఆల్ఫా ఆలోచనలకు అనుగుణంగా పార్టీలో 50 శాతం మేర సంస్థాగత బాధ్యతలను యువతకే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగ విలువలు, అంబేడ్కర్‌వాద సిద్ధాంతాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే కొత్త తరాన్ని నిర్మించడమే తన సంకల్పమని పేర్కొన్నారు. నాలుగు సార్లు బీఎస్పీ సాగించిన సుపరిపాలనలో రోడ్లు, తాగునీరు, విద్య, ఉపాధి, రక్షణ రంగాల్లో మైలురాళ్ళు సాధించామని, పల్లెల నుంచి వలసలను అడ్డుకున్నామని మాయావతి గుర్తుచేశారు. 2012లో విపక్షాలు సాగించిన కులతత్వ రాజకీయాల కారణంగానే బీఎస్పీ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చట్టబద్ధ పాలన అటకెక్కిందని, బీఎస్పీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ప్రత్యర్థులు ‘సామ, దాన, భేద, దండోపాయాలు’ ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు.

క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా బయటకు పంపిన నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటున్నారంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. అదంతా తప్పుడు ప్రచారమని, క్రమశిక్షణ ఉల్లంఘించిన ఏ ఒక్కరికీ బీఎస్పీ తలుపులు తిరిగి తెరుచుకోవని తేల్చిచెప్పారు. అంబేడ్కర్‌వాద ఆశయ సాధనకు కార్యకర్తలు పూర్తి శక్తితో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.