Math Teacher Thrashed By Students in Jharkhand: తక్కువ మార్కులు ఇచ్చాడని ఏకంగా ఉపాధ్యాయుడినే చెట్టుకు కట్టేసి చితకబాదారు విద్యార్థులు. టీచర్ తో పాటు క్లర్కును కూడా విద్యార్థులు వదిలిపెట్టలేదు. ఇద్దర్ని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం దుమ్కా జిల్లాలో సోమవారం జరిగింది. 9 వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వేశాడని.. మాథ్స్ టీచర్ తో పాటు గుమాస్తాను చెట్టుకు కట్టేసి కొట్టినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అయితే ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. పోలీసులు వెల్లడించారు.
జార్ఖండ్ దుమ్కా జిల్లా గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ షెడ్యూల్డ్ ట్రైబ్ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థులు గణిత ఉపాధ్యాయుడిని కొట్టారు. జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ ( జేఏసీ) శనివారం విడుదల చేసిన ఫలితాల్లో 9వ తరగతి చదువుతున్న 32 మందిలో 11 మంది విద్యార్థులు గ్రేడ్-డీడీ పొందారు. వీరంతా ఫెయిల్ అయ్యారు. అయతే తమకు ప్రాక్టికల్స్ లో గణిత ఉపాధ్యాయుడు తక్కువ మార్కులు వేశాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమకు తక్కువ మార్కులను క్లర్క్ అప్ లోడ్ చేశాడని విద్యార్థులు చెబుతున్నారు.
Read Also: COVID 19: ఇండియాలో కొత్తగా 7 వేల కరోనా కేసులు.. కేరళలోనే ఎక్కువ మరణాలు
ఈ సంఘటనపై పాఠశాల యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే విద్యార్థుల భవిష్యత్ పాడవుతుందనే ఉద్దేశ్యంతో పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు చేయలేదు. దెబ్బలు తిన్న ఉపాధ్యాయుడిని సుమన్ కుమార్, క్లర్క్ సోనే రామ్ చౌరేగా గుర్తించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థులు ఉన్నారని.. ఈ సంఘటనలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రిన్స్ పాల్ గా పనిచేసిన బాధిత ఉపాధ్యాయుడు సుమన్ కుమార్ ను కొన్ని ఆరోపణలపై ప్రధానోపాధ్యాయుడి నుంచి తొలగించారు. అయితే విద్యార్థులు ప్రాక్టికల్స్ లో తక్కువ మార్కులు సాధించినందుకే ఫెయిల్ అయ్యారా.. లేకపోతే థియరీ పేపర్ లో విఫలం అయ్యారా..? అనేది స్పష్టంగా తెలియరాలేదు.
