Massive protest at Belagavi for no to maha mela, sec 144 imposed: కర్ణాటక, మహారాష్ట సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత పెరిగింది. సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లోని కోగ్నోలి టోల్ ఫ్లాజా దగ్గర వందలాది మంది మహారాష్ట్ర ఏకీకరణ సమితి(ఎంఇఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కార్యకర్తలు, నాయకులు సోమవారం పెద్దఎత్తున నిరసన తెలిపారు. మహామేళాకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో సీఎం బస్వరాజ్ బోమ్మైకి వ్యతిరేకంగా అంతర్ రాష్ట్ర సరిహద్దు బెలగావికి సమీపంలో నిరసన తెలిపారు.
ఎంఈఎస్ ప్రతీ ఏడాది కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభ రోజున బెలగావిలో సమావేశాన్ని నిర్వహిస్తుంటుంది. ఐదు దశాబ్ధాలుగా సరిహద్దు సమస్యను లేవనెత్తుతోంది ఈ సంస్థ. అయితే తాజాగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలకు ముందు భారీ నిరసనలకు ప్లాన్ చేసింది. శాసనసభ 10 రోజుల శీతాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బెలగావి పట్టణంలో ఎంఈఎస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వందలాది కార్యకర్తలు, నాయకులు గుమిగూడటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
Read Also: Lionel Messi: మెస్సీ అస్సాంలో పుట్టాడు.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ వైరల్
సరిహద్దు వివాదంలో బెలగావిలో హై అలర్ట్ విధించింది ప్రభుత్వం. దాదాపుగా 5000 మంది పోలీసులను మోహరించారు. ఆరుగురు ఎస్పీలు, 11 ఏఎస్పీలు, 43 మంది డీఎస్పీలు, 95 మంది సీఐలు, 241 మంది ఎస్ఐలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు శివసేన ఎమ్మెల్యేలను బెలగావిలోకి అనుమతించడం లేదు కర్ణాటక ప్రభుత్వం. అయితే సరిహద్దు వివాదంపై ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. శివసేన, ఎన్సీపీ పార్టీలు అధికార బీజేపీపై విమర్శలు చేస్తున్నాయి.
మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో జాత్ తహసీలుకు చెందిన కొన్ని గ్రామాలు కర్ణాటకలో విలీనం అయ్యేందుకు తీర్మానం చేశాయని కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై అనడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిగా మహారాష్ట్రలోని ఏ గ్రామం కూడా కర్ణాటకలోకి వెళ్లదని.. బెల్గాం-కార్వార్-నిపానీ సహా మరాఠీ మాట్లాడే గ్రామాలను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో గట్టిగా పోరాడుతుందని .. ఏ గ్రామం కూడా కర్ణాటకలో చేరేందుకు తీర్మానం చేయలేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించడంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ముదిరింది. 1956లో రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి ఈ సమస్య అలాగే ఉంది. కర్ణాటకలోని బెళగావిని మహారాష్ట్ర తమదే అని చెబుతుంటే.. మహారాష్ట్రలోని షోలాపూర్ తమదే అని కర్ణాటక చెబుతోంది.