NTV Telugu Site icon

Delhi High Court: అత్యాచారం చేసి బాధితురాలని పెళ్లి చేసుకున్నంత మాత్రాన కేసును మూసేయలేం..

Delhi High Court

Delhi High Court

Delhi High Court: మైనర్‌పై అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అత్యాచార బాధితురాలు, నిందితుడి మధ్య వివాహం ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి కారణం కాదని, అతనిపై వచ్చిన అభియోగాలు తీవ్రమైన స్వభావం కలిగినవని హైకోర్టు పేర్కొంది. ఇరు పక్షాల మధ్య కుదిరిన సెటిల్మెంట్ ఆధారంగా అత్యాచార నేరాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ప్రస్తావించారు.

Read Also: Dhanush: మ్యూజిక్ మ్యాస్ట్రో బయోపిక్.. ధనుష్ ఖాతాలో మరో రికార్డ్

ఈ కేసులో 16 ఏళ్ల బాలికతో నిందితుడి చాలాసార్లు లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, అతని కారణంగా గర్భవతి అయిందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితుడు, సదరు బాలికను వివాహం చేసుకున్నంత మాత్రాన ఎఫ్ఐఆర్ రద్దు చేయబడదని, ప్రస్తుతం ఈ కేసులో సెక్షన్ 376 ఐపీసీ, పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కేసులు నమోదయ్యాయి. ఇవి నేర తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తున్నాయని కోర్టు తన ఆర్డర్‌లో పేర్కొంది.

ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు బాధితురాలు తన ఇష్టానుసారం అతడిని పెళ్లి చేసుకున్నట్లు హైకోర్టుకు వెల్లడించింది. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ నిందితుడు వేసిన పిటిషన్‌ని ప్రభుత్వం వ్యతిరేకించింది. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నేరాలు నాన్-కాంపౌండబుల్ నేరాలు అని తెలిపింది. కాంపౌండబుల్ నేరాలు అంటే ఇరు పక్షాలు రాజీ కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి నేరాలు సమాజానికి విరుద్ధమని, రాజీ కుదిరితే వాటిని కొట్టివేయలేమని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకుని నిందితుడి పిటిషన్‌ని కొట్టేసింది. నేర తీవ్రత దృష్ట్యా వాటిని రద్దు చేయలేమని కోర్టు పేర్కొంది.