భారత్‌లో వైవాహిక అత్యాచారం (Marital Rape) అంశంపై దాదాపు దశాబ్దంగా కొనసాగుతున్న న్యాయ, రాజ్యాంగపరమైన చర్చ ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. పెళ్లి అనే బంధం ఉన్నంత మాత్రాన భార్య సమ్మతి లేకుండా భర్త లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని అత్యాచారంగా పరిగణించకుండా చట్టం మినహాయింపు ఇవ్వడం రాజ్యాంగబద్ధమేనా? అనే కీలక ప్రశ్నపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది.
సెప్టెంబర్ 9న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ముందుగా 2022లో కర్ణాటకలో నమోదైన ఓ కేసును పరిశీలించాలని నిర్ణయించింది. ఇందులో ఓ భర్త తన భార్యపై లైంగిక హింసకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసును పరిశీలించిన అనంతరం వైవాహిక అత్యాచారానికి సంబంధించిన సవాలును విచారించనుంది.
అసలు వివాదం ఏమిటి?
భార్య సమ్మతి లేకుండా భర్త లైంగిక సంబంధం పెట్టుకున్నా.. వివాహ బంధం కారణంగా దాన్ని అత్యాచారంగా పరిగణించకుండా చట్టం మినహాయింపు ఇస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 63, ఎక్సెప్షన్ 2 ప్రకారం.. 18 ఏళ్లకు పైబడిన భార్యతో భర్త లైంగిక సంబంధం పెట్టుకున్న సందర్భంలో, భార్య సమ్మతి లేకపోయినా అది ‘రేప్’ నిర్వచనంలోకి రాదు. అయితే ఇలాంటి లైంగిక హింసకు గురైన మహిళకు క్రూరత్వం, గృహ హింస వంటి ఇతర చట్టాల కింద పరిహార మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కానీ బలవంతపు లైంగిక చర్యను ప్రత్యేకంగా ‘అత్యాచారం’గా పరిగణించాలా? అన్నదే ప్రస్తుత ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ విషయంపై న్యాయస్థానాల్లో తర్జన భర్జన సాగుతోంది.
హైకోర్టుల్లో భిన్న తీర్పులు
ఈ అంశంపై వివిధ హైకోర్టులు కూడా వేర్వేరు సందర్భాల్లో తీర్పులు ఇచ్చాయి.
2018లో గుజరాత్ హైకోర్టు ఓ కేసులో వివాహ బంధంలో లైంగిక వేధింపుల ఆరోపణలను పరిశీలిస్తూ.. వైవాహిక అత్యాచారం అనేది వివాహంపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది. అయితే అప్పటి చట్టంలోని మినహాయింపును రద్దు చేయలేదు. ఇతర IPC నిబంధనల కింద చర్యలకు అవకాశం ఉందని పేర్కొంది.
2019లో ఢిల్లీ హైకోర్టు ముందు వచ్చిన మరో కేసులో.. వైవాహిక అత్యాచారాన్ని విడాకులకు కారణంగా చట్టపరంగా గుర్తించాలని కోరిన పిటిషన్‌పై న్యాయస్థానం చట్టాల రూపకల్పన శాసనసభ పరిధిలోని అంశమని పేర్కొంది.
2021లో కేరళ హైకోర్టు.. భర్త బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకోవడం క్రూరత్వంగా పరిగణించవచ్చని, విడాకులకు కారణం కావచ్చని తీర్పు ఇచ్చింది.
అదే ఏడాది ఛత్తీస్‌గఢ్ హైకోర్టు.. ప్రస్తుత చట్టంలోని వైవాహిక మినహాయింపు కారణంగా వయోజన భార్యపై అత్యాచారం చేసినందుకు భర్తపై రేప్ కేసు పెట్టలేమని పేర్కొంది. అయితే ఇతర నేరాల కింద చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.
‘మగాడు మగాడే.. చర్య చర్యే.. రేప్ రేపే’
2022లో కర్ణాటక హైకోర్టు ముందు వచ్చిన ‘హృషికేశ్ సాహూ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక’ కేసు ఈ చర్చను మరో స్థాయికి తీసుకెళ్లింది. భార్యపై లైంగిక హింసకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తపై నమోదైన అత్యాచారం కేసును కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎం. నాగప్రసన్న.. వివాహం జరిగినంత మాత్రాన భార్యకు ఉన్న లైంగిక స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులు అంతరించిపోవని 2013 జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫారసులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన “A man is a man; an act is an act; rape is a rape” అని వ్యాఖ్యానించారు. అయితే వైవాహిక అత్యాచారానికి సంబంధించిన చట్టపరమైన మినహాయింపు రాజ్యాంగబద్ధతను తుది నిర్ణయంగా తేల్చకుండా.. భర్తకు అది సంపూర్ణ రక్షణ కాదని హైకోర్టు పేర్కొంది.
ఇక ఢిల్లీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2022 మే 11న ఢిల్లీ హైకోర్టు వైవాహిక అత్యాచారానికి సంబంధించిన మినహాయింపుపై భిన్న తీర్పు ఇచ్చింది. జస్టిస్ రాజీవ్ శక్ధర్.. ఈ మినహాయింపు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19(1)(a), 21కు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. భర్త తన భార్యతో ఆమె సమ్మతి లేకుండా లైంగిక సంబంధం పెట్టుకున్న సందర్భంలో రేప్ కేసు నుంచి భర్తకు రక్షణ కల్పించే మినహాయింపును తొలగించాలని ఆయన తీర్పు ఇచ్చారు. వివాహం జరిగిందన్న కారణంతోనే లైంగిక సంబంధానికి భార్య సమ్మతి ఉన్నట్లుగా భావించలేమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో జస్టిస్ సి. హరి శంకర్ దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వివాహ బంధం ప్రత్యేకమైన చట్టపరమైన సంబంధమని, పార్లమెంట్ తగిన రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా అలాంటి వర్గీకరణ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో వైవాహిక అత్యాచార మినహాయింపును రద్దు చేసే మెజారిటీ తీర్పు వెలువడలేదు. దీంతో ఈ రాజ్యాంగపరమైన ప్రశ్న పరిష్కారం కాకుండా మిగిలిపోయింది.
‘తప్పుడు కేసులు పెరుగుతాయి’
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తిస్తే భర్తలపై పెద్ద సంఖ్యలో తప్పుడు కేసులు నమోదయ్యే అవకాశం ఉందనే వాదన కూడా విచారణల్లో వచ్చింది. జస్టిస్ శక్ధర్ మాత్రం ఈ వాదనకు తగిన గణాంక ఆధారాలు లేవని పేర్కొన్నారు. 2015-16లో నిర్వహించిన NFHS-4 గణాంకాలను ఆయన ప్రస్తావించారు. లైంగిక హింసకు గురైనట్లు తెలిపిన వివాహిత మహిళల్లో 82.6 శాతం మంది ప్రస్తుత భర్తనే నిందితుడిగా పేర్కొన్నట్లు ఆ తీర్పులో ప్రస్తావించారు. అదే సమయంలో దాదాపు 99 శాతం లైంగిక దాడులు అధికారికంగా నివేదించబడటం లేదని కూడా తీర్పులో పేర్కొన్నారు.
కేంద్రం వైఖరి ఏంటి?
వైవాహిక అత్యాచారాన్ని రేప్ నేరంగా మార్చడం న్యాయవ్యవస్థ ద్వారా జరగకూడదన్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి. 2024లో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో.. వివాహం కారణంగా మహిళ సమ్మతి హక్కు కోల్పోదని కేంద్రం పేర్కొంది. అయితే వివాహంలో జరిగే లైంగిక హింసను ‘రేప్’గా పరిగణించడం అతిగా కఠినమైన, అసమానమైన చర్యగా మారవచ్చని కేంద్రం వాదించింది. దాడి, లైంగిక వేధింపులు, క్రూరత్వం, గృహ హింసకు సంబంధించిన ఇతర చట్టాల ద్వారా ఇప్పటికే పరిహార మార్గాలు ఉన్నాయని పేర్కొంది. ఈ అంశం విస్తృత సామాజిక, శాసన విధానానికి సంబంధించినదని.. చట్టంలో మార్పులు చేయాలా వద్దా అనే నిర్ణయం పార్లమెంట్ తీసుకోవాలని కేంద్రం అభిప్రాయపడుతోంది.
ముందున్న అసలు ప్రశ్న
ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందున్న ప్రధాన ప్రశ్న.. వివాహ బంధం ఉన్నందుకు మాత్రమే భార్య సమ్మతి లేకుండా జరిగే లైంగిక సంబంధాన్ని ‘రేప్’ నిర్వచనం నుంచి మినహాయించవచ్చా? అన్నది. అలాగే ప్రస్తుత చట్టంలోని మినహాయింపు అమల్లో ఉన్న సమయంలోనే భర్తపై రేప్ కేసును కొనసాగించవచ్చా? అనే ప్రశ్నను కూడా ధర్మాసనం పరిశీలిస్తోంది. జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ విచారణ సందర్భంగా.. “మినహాయింపు రాజ్యాంగబద్ధతపై నిర్ణయం తీసుకునే వరకు.. రేప్ కేసు విచారణను కొనసాగించవచ్చా?” అనే ప్రశ్నను లేవనెత్తారు. మూడు వారాల తర్వాత ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే తదుపరి విచారణ తేదీని కోర్టు ఇంకా ఖరారు చేయలేదు. మొత్తంగా.. వైవాహిక అత్యాచారంపై దాదాపు దశాబ్దంగా కొనసాగుతున్న చట్టపరమైన వివాదానికి ఈ విచారణ కీలక మలుపుగా మారింది.

